WPL 2025 MI Vs GG Eliminater Match Highlights: డ‌బ్ల్యూపీఎల్ లో మాజీ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. అన్నిరంగాల్లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన ముంబై.. గురువారం జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై 47 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల‌కు 213 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ హీలీ మ‌థ్యూస్ (50 బంతుల్లో 77, 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), వ‌న్ డౌన్ బ్యాట‌ర్ నాట్ స్కివ‌ర్ బ్రంట్ (41 బంతుల్లో 77, 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మెరుపు అర్థ సెంచ‌రీలతో టాప్ స్కోర‌ర్లుగా నిలిచారు. వీరిద్ద‌రూ రెండో వికెట్ కు 133 ప‌రుగులు జోడించ‌డంతో ముంబై భారీ స్కోరు సాధించింది. బౌల‌ర్ల‌లో డానియెల్ గిబ్స‌న్ కు రెండు వికెట్లు ద‌క్కాయి. భారీ టార్గెట్ ను చూసి బెంబేలెత్తిపోయిన గుజరాత్.. ఛేజింగ్ లో చేతులెత్తేసింది. 19.2 ఓవ‌ర్లలో 166 ప‌రుగులకు ఆలౌటై, ఓడిపోయింది. ఓపెన‌ర్ గిబ్స‌న్ (34) బ్యాటింగ్ లోనూ రాణించి, టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌల‌ర్ల‌లో హీలీ మ‌థ్యూస్ 3, అమెలియా కెర్  రెండు వికెట్ల‌తో స‌త్తా చాటారు. ఈ విజ‌యంతో ముంబై ఫైన‌ల్ కి అర్హ‌త సాధించింది. శ‌నివారం (మార్చి 15న‌) ఇదే వేదిక‌పై జ‌రిగే తుదిపోరులో రెండుసార్లు ఫైన‌లిస్టు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను ఢీకొన‌నుంది.  

అద్భుత‌మైన పార్ట్న‌ర్ షిప్..ముంబై విజ‌యం సాధించింది అంటే బ్యాట‌ర్ల ప్ర‌తిభ‌తోపాటు ఆరంభంలోనే మంచి పార్ట్న‌ర్ షిప్ ల‌ను న‌మోదు చేయ‌డంలోనే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్టింగ్ లోనే య‌స్తిక భాటియా (15) ఔటైనా, బ్రంట్ తో క‌లిసి హీలీ త‌న జోరును కొన‌సాగించింది. వీరిద్ద‌రూ ఎడాపెడా బౌండ‌రీలు బాద‌డంతో రాకెట్ వేగంతో స్కోరు దూసుకుపోయింది. ముఖ్యంగా హీలీ కంటే బ్రంట్ చాలా వేగంగా ఆడింది. ప్రతి ఒక్క బౌల‌ర్ పై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తూ జ‌ట్టుకు భారీ స్కోరు అందించారు. ఈ క్ర‌మంలో 36 బంతుల్లో ఫిఫ్టీ చేసుకున్న హీలీ ఔటైంది. ఆ త‌ర్వాత కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (12 బంతుల్లో 36, 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) 300 స్ట్రైక్ రేట్ తో ప‌రుగులు సాధించింది. దీంతో జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో క‌శ్వీ గౌతంకి ఒక వికెట్ ద‌క్కింది. 

ఛేద‌న‌లో తుస్..భారీ టార్గెట్ ఛేద‌న‌లో గుజ‌రాత్ స‌రైన వాడిని చూపించ‌లేక‌పోయింది. ఒత్తిడికి త‌లొగ్గి, తేలిక‌గా వికెట్లు స‌మ‌ర్పించుకుని ప‌రాజ‌యం పాలైంది. ఆరంభంలోనే బేత్ మూనీ (6) వికెట్ కోల్పోయిన గుజ‌రాత్.. ఆ త‌ర్వాత వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. హ‌ర్లీన్ డియోల్ (8), కెప్టెన్ యాష్లీ గార్డెనర్ (8) చేతులెత్తేశారు. అంత‌కుముందు గిబ్స‌న్ కాస్త పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శించింది. మ‌ధ్య‌లో ఫోబ్ లిచ్ ఫిల్డ్ (31), భార‌తి ఫుల్మ‌లి (30) జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు. అయితే ముంబై బౌల‌ర్లు విజృంభించ‌డంతో నాలుగు బంతులు మిగిలిఉండ‌గానే గుజ‌రాత్ ఇన్నింగ్స్ కు తెర‌ప‌డింది. మిగ‌తా బౌల‌ర్లలో ష‌బ్నిం ఇస్మాయిల్, బ్రంట్ కు త‌లో వికెట్ ద‌క్కింది.