Laxman Sivaramakrishnan: భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి కామెంటరీ ప్యానెల్‌కు ఆయన అధికారికంగా రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ వీడ్కోలు కేవలం వయసు రీత్యా తీసుకున్న నిర్ణయం కాదని, ఆవేదన, వివక్ష, వేధింపులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది.
రెండేళ్ల నిశ్శబ్దం ఆపై విస్పోటనం
గత రెండేళ్లుగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా కనిపించడం లేదు. మైదానంలో గంభీరంగా వినిపించే ఆయన స్వరం ఎందుకు వినిపించడం లేదనే అభిమానుల ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. " నేను గత రెండేళ్లుగా కామెంటరీకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు అధికారికంగా బీసీసీఐ కామెంటరీకి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నాను." అని ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ రెండేళ్ల విరామం ఆయనలో ఒక కొత్త ఆలోచనా దృక్పథాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను భరించడం ఇక తన వల్ల కాదని ఆయన చెప్పుకొచ్చారు.
ముంబై మాఫియా వేధింపులు
లక్ష్మణ్ శివరామకృష్ణన్ చేసిన ఆరోపణల్లో ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ముంబై మాఫియా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. క్రికెట్ పాలక వర్గాల్లో లేదా విశ్లేషణ విభాగాల్లో ఒక వర్గం ఆధిపత్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. "ముంబై మాఫియా సన్ను తీవ్రంగా వేధించింది". అని ఆయన నేరుగా చెప్పడం చర్చనీయాంశమైంది.
నల్లగా ఉంటే కామెంటరీకి పనికి రారా
కామెంటరీ రంగంలో వర్ణ వివక్ష ఉందని లక్ష్మణ్ శివరామకృష్ణన్ పోస్టు పెట్టారు. భారత్ వంటి దేశంలో ఇక్కడ మెజార్టీ ప్రజల గోధుమ లేదా నలుపు రంగులో ఉన్నప్పటికీ గ్లామర్ పేరిట వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. " నేను వర్ణ వివక్షకు గురయ్యాను, నల్లగా ఉంటే కామెంటరీకి పనికి రారా" అని అంటూ ఆయన సంధించిన ప్రశ్న సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
క్రికెట్ ప్రపంచం నుంచి విరామం తీసుకున్న ఈ రెండేళ్ల కాలాన్ని లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన మనసుకు నచ్చిన పనుల ద్వారా ప్రశాంతతను వెతుకున్నట్టు తెలిపారు. రెండేళ్లుగా గోల్ఫ్ మీద దృష్టి పెట్టాను. ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తన కుటుంబాన్ని నాణ్యమైన సమయాన్ని కేటాయించగలుగుతున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కెరీర్ పరుగు పందెంలో కోల్పోయిన ఆత్మీయతను ఇప్పుడు కుటుంబంతో కలిసి అనుభవిస్తున్నట్టు చెప్పారు.
