BCCI Tightens Injury Protocol Ahead Of Afghanistan T20Is: అఫ్గానిస్తాన్‌తో ఢిల్లీ వేదికగా జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సీనియర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు నిరాశ ఎదురైంది. అక్షర్ పటేల్ ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో కృనాల్ తిరిగి బ్లూ జెర్సీ ధరించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించినా, సెలెక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను కొనసాగిస్తూ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లను స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా సెలెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కృనాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో "హోప్ ఈజ్ స్టిల్ అలైవ్" అంటూ ఇండియా ఫ్లాగ్, ఫింగర్స్ క్రాస్డ్ ఎమోజీలతో ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు.
ఐపీఎల్లో ఆర్సీబీ హీరో..జూలై 2021 లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన కృనాల్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సాధించిన బ్యాక్ టు బ్యాక్ టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో 9 ఇన్నింగ్స్‌లలో 37.66 సగటు, 145.80 స్ట్రైక్ రేట్‌తో 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు కూల్చి తన ఆల్‌రౌండ్ సత్తా చాటాడు. అంతకుముందు సీజన్ ఫైనల్లో నాలుగు ఓవర్లలో 2/17 అద్భుత స్పెల్‌తో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచి ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో వెన్నెముకగా నిలిచాడు. ఇండియా తరఫున 19 టీ20ల్లో 15 వికెట్లు, 124 రన్స్ చేసిన రికార్డు అతడి సొంతం.
గాయాల నుంచి కోలుకుని బుమ్రా రీఎంట్రీ.. ఈ సిరీస్ ద్వారా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన తర్వాత అతడు తొలిసారి జట్టు జాబితాలో చేరాడు. అయితే బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాల పేర్ల పక్కన ఆస్టరిస్క్ గుర్తు పెట్టిన బీసీసీఐ, పూర్తి ఫిట్నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులో ఆడిస్తామని తెలిపింది.
అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13 నుంచి సమరంఅఫ్గానిస్తాన్ హోస్ట్ చేసే ఈ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ సిరీస్ సెప్టెంబర్ 13న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో మొదటి టీ20తో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 15, 17 తేదీల్లో తర్వాతి రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ తమ స్థానాలు తిరిగి పొందారు.
