15 Years Vaibhav Sooryavanshi Shines In Duleep Trophy Semifinal: బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు ఇన్నింగ్స్‌లతో మరోసారి సత్తా చాటాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన వైభవ్, కెప్టెన్ ఇషాన్ కిషన్ గైర్హాజరీలో కొద్దిసేపు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వహించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 92, 40 పరుగులతో సూపర్ నాక్స్ ఆడి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు. ఇండియా అండర్-19, ఇండియా ఏ, రాజస్థాన్ రాయల్స్ తరఫున వైట్ బాల్ ఫార్మాట్‌లో సత్తా చాటిన ఈ యంగ్ స్టార్, ఇప్పుడు ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నీలోనూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ ప్రదర్శన..ముఖ్యమైన నాకౌట్ మ్యాచ్‌లలో నిలకడగా రాణించడంలో వైభవ్ సూర్యవంశీ రికార్డు అద్భుతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆడిన 10 నాకౌట్ మ్యాచ్‌లలోని 11 ఇన్నింగ్స్‌లలో 65.18 సగటుతో 717 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. గరిష్ట స్కోరు 175 రన్స్ కావడం విశేషం. అండర్-19 ఆసియా కప్, 2026 అండర్-19 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్స్ తో పాటు ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 97, క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ టైటాన్స్ పై 96 పరుగులు బాది బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో టై స్కోరు..సెమీస్ లో తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ 266 పరుగులు చేయగా, ఈస్ట్ జోన్ కూడా సరిగ్గా 266 పరుగులే చేసింది. ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ సూర్యవంశీ కేవలం 81 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 92 పరుగులు సాధించాడు. దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలోనే హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 159 పరుగుల లక్ష్య ఛేదనలో 43 బంతుల్లో 40 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది.
పేసర్ల దెబ్బ..రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్‌ను 158 పరుగులకే కుప్పకూల్చడంలో పేసర్లు ముకేష్ కుమార్ (4/44), మహమ్మద్ షమీ (3/56) కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఐదు వికెట్లు పడగొట్టిన షమీ టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. లక్ష్య ఛేదనలో హర్ష్ దూబే 4 వికెట్లు తీసి ఒత్తిడి తెచ్చినా, కెప్టెన్ ఇషాన్ కిషన్ 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయపథంలో నడిపాడు. మహమ్మద్ షమీ విన్నింగ్ షాట్ కొట్టడంతో ఈస్ట్ జోన్ 162/6 స్కోరుతో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఘనంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
