Jofra Archer is set to feature in the third match against India: ఇండియాతో నేట నుంచి(గురువారం )నుంచి లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్టుకు ప్లేయింగ్ లెవన్ ను ఇంగ్లాండ్ జట్టు ప్రకటించింది. గత రెండు టెస్టుల్లో మ్యాచ్ కు రెండు రోజుల ముందుగా ప్లేయింగ్ లెవన్ ను ప్రకటించిన ఇంగ్లాండ్.. ఈసారి ఒకరోజు ఆలస్యంగా తమ తుదిజట్టును ప్రకటించింది. ఈసారి జట్టులో ఒక మార్పు చేసింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సుదీర్ఘ కాలం తర్వాత రెడ్ బాల్ ఫార్మాట్ లోకి వచ్చాడు. తను చివరిసారిగా 2021 ఫిబ్రవరిలో అంతర్జాతీయ టెస్టు ఆడాడు. అలాగే అహ్మదాబాద్ వేదికగా అదే ఏడాది జరిగిన టెస్టు తర్వాత తను భారత్ పై టెస్టు ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మోచేతి గాయం, వెన్ను నొప్పితో గత నాలుగున్నర ఏళ్లుగా తను రెడ్ బాల్ ఫార్మాట్ కు అందుబాటులో ఉండటం లేదు. కేవలం వైట్ బాల్ క్రికెట్ అయిన వన్డేలు, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ఇక మూడో టెస్టు వేదిక లార్డ్స్ వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని నేపథ్యంలో ఆర్చర్ తుదిజట్టులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
టంగ్ స్థానంలో..తొలి రెండు టెస్టుల్లో నాటింగ్ హామ్ పేసర్ అయిన జోష్ టంగ్ ఫర్వాలేదనిపించాడు. రెండో టెస్టులో కీలక వికెట్లు తీశాడు. అయితే ఆర్చర్ కోసం అతడిని పక్కన పెట్టక తప్పలేదు. ఆర్చర్ రాకతో అటు బౌలింగ్ తోపాటు ఇటు టెయిల్ లోనూ కాస్త బ్యాట్ ఝళిపించ ఆటగాడు ఇంగ్లాండ్ కు లభించినట్లయ్యింది. అయితే టెస్టుల్లో ఆర్చర్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. 2019లో అరంగేట్రం చేసిన ఈ 30 ఏళ్ల పేసర్.. ఇప్పటివరకు కేవలం 13 టెస్టులు మాత్రమే ఆడాడు. 31కిపైగా సగటుతో 42 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆర్చర్ రాకతో పేస్ దళం పుంజుకుందని ఇంగ్లాండ్ భావిస్తోంది. అనుభవం లేని పేసర్లతో రెండు టెస్టులో భారీగా పరుగులు సమర్పించుకున్నామని, అనుకూలించే పిచ్ తోపాటు ఆర్చర్ రాకతో మూడో టెస్టులో పట్టు బిగిస్తామని ఇంగ్లాండ్ ఆశాభావంగా ఉంది.
సమ ఉజ్జీలుగా ఇరుజట్లు..ఇక పిచ్ ను ఉద్దేశించి టీమిండియాలో కూడా మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా రెండో టెస్టులో విశ్రాంతి తీసుకున్న జస్ ప్రీత్ బుమ్రా.. మూడో టెస్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. పిచ్ పేసర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో నాలుగో పేసర్ గా అర్షదీప్ సింగ్ ను తీసుకునే అవకాశం ఉంది. అలాగే వాషింగ్టన్ సుందర్ ను పక్కన పెట్టే చాన్స్ ఉంది. తొలి టెస్టులో ఓడినా, రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకున్న భారత్.. 336 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే భారత టెస్టు చరిత్రలో తొలిసారి బర్మింగ్ హామ్ వేదికపై విజయం సాధించింది. ఈ జోరు ఇలాగే కొనసాగాలని భావిస్తోంది.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవన్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఒల్లీ పోప్, జో రూట్, హేరీ బ్రూక్, జేమీ స్మిత్,క్రిస్ వోక్స్, బ్రైడెన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.