Joe Root: ఏ ఫార్మాట్‌లో అయినా అరంగేట్ర మ్యాచ్ అంటే ఓ ప్రత్యేకమైన అనుభూతి. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అన్నట్టు  మొదటి మ్యాచ్‌లో అదరగొడితే  ఆ తర్వాత కెరీర్‌ను సాఫీగా  సాగించేందుకు అవకాశాలు  మెండుగా ఉంటాయి.  కానీ  ఈ ఇంగ్లాండ్  మాజీ సారథికి మాత్రం అరంగేట్ర మ్యాచ్‌లు కలిసిరావడం లేదు. అతడెవరో కాదు ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్.  ఆధునిక క్రికెట్‌లో  ‘ది బెస్ట్’ అనదగ్గ ప్లేయర్లలో ఒకడైన  రూట్..  ఒక్క టెస్టులలో తప్ప  మిగిలిన ఫార్మాట్‌లు, లీగ్ లలో  ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ కు రాలేదు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. 


జో రూట్ అంతర్జాతీయ అరంగేట్రం అన్నీ భారత్‌లోనే జరిగాయి. 2012-2013లో ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటించింది.  ఈ మూడు ఫార్మాట్ల సిరీస్ లో భాగంగా టెస్టులలో భాగంగా భారత్ - ఇంగ్లాండ్ మధ్య నాగ్‌పూర్ లో జరిగిన నాలుగో టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు. వాంఖెడే వేదికగా జరిగిన రెండో టీ20లో  ఆడాడు.  2013 జనవరిలో రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. కాగా టెస్టులో తప్ప వన్డేలు, టీ20 అరంగేట్ర మ్యాచ్ లలో  రూట్ కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. నాగ్‌పూర్ టెస్టులో మాత్రం రూట్.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో  229 బంతులలో 73, రెండో ఇన్నింగ్స్ లో  56 బంతుల్లో 20 రన్స్ చేశాడు. 


 






ఆ రెండే కాదు.. 


వన్డేలు, టీ20లలోనే కాదు..  ఇంగ్లాండ్ లో జరిగే ‘ది హండ్రెడ్ లీగ్’లో కూడా ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో  బ్యాటింగ్ కు దిగలేదు. తాజాగా ఐపీఎల్ -16లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో  రాజస్తాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్ లో  రాజస్తాన్ తరఫున ఎంట్రీ ఇచ్చిన రూట్‌కు బట్లర్, శాంసన్ ల బాదుడుతో బ్యాటింగ్ కు దిగే అవకాశమే రాలేదు.  రెండు క్రికెట్ లీగ్ లు, రెండు ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్ లో  బ్యాటింగ్ కు రాని  ఓ విచిత్రమైన ఘనతను రూట్ సొంతం చేసుకున్నాడు. 


 






కాగా రూట్‌ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చినా అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో ట్విటర్ లో అతడిపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.   రూట్  15 బంతుల్లో హాఫ్ సెంచరీని  చూసేందుకు అంతర్జాతీయ క్రికెట్  సిద్ధంగా లేదని ట్రోల్స్ వచ్చాయి. అదేవిధంగా  బట్లర్, శాంసన్ బ్యాటింగ్ చేస్తుండగా ఇక నాకు బ్యాటింగ్ కు రాదేమో అన్నట్టుగా  రూట్ ఫేస్ పెట్టిన ఫోటో  ఇంటర్నెట్ లో  వైరల్ గా మారింది.