India vs England 2nd Test Jasprit Bumrah's yorker: గత మ్యాచ్‌ సెంచరీ హీరో ఓలి పోప్‌( Ollie Pope) ను అద్భుతమైన యార్కర్‌తో బుమ్రా(Jasprit Bumrah) బౌల్డ్‌ చేసిన బంతిని చూసి తీరాల్సిందే. మ్యాచ్‌ను రక్షించేందుకు పోరాడుతున్న ఇంగ్లాండ్‌ సారధి బెన్‌ స్టోక్స్‌ను బౌల్డ్‌ చేసిన బంతి అయితే అద్భుతమే. అంతేనా బ్యాటర్లను ఊరిస్తూ ఇన్‌ స్వింగ్‌, అవుట్‌ స్వింగ్‌లతో బుమ్రా వైజాగ్‌ టెస్ట్‌లో నిప్పులు చెరిగాడు. బజ్‌బాల్‌ ఆటతో బ్రిటీష్‌ బ్యాటర్లు విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైన చోట బుమ్రా బంతితో చెలరేగిపోయాడు. 




 

ఆ యార్కర్‌ అయితే...

టీమిండియాలో టెస్ట్‌ మ్యాచ్‌ అంటే అందరి చూపు స్పిన్నర్లపైనే. పేసర్లు నామమాత్రంగా మారిపోతారు. కానీ అందరూ ఒకెత్తు. పేసు గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా మరో ఎత్తు. వైజాగ్‌ టెస్ట్‌లో స్పిన్నర్లకు, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బుమ్రా ప్రదర్శన  అబ్బురపరిచింది. నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. ఓలి పోప్‌ గత మ్యాచ్‌లో కొంచెంలో డబుల్‌ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ మంచి టచ్‌లో కనిపించి మరోసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడేలా కనిపించాడు. 23 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను కాపాడేలా కనిపించిన పోప్‌ను.. బుమ్రా సూపర్‌ యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు. బుమ్రా సంధించిన యార్కర్‌కు పోప్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ యార్కర్లలో ఒకటిగా ఇది నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అనంతరం 47 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ సారధి స్టోక్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్‌ చేశాడు. అద్భుతమైన బంతితో స్టోక్స్‌ను బౌల్డ్‌ చేశాడు. ఈ బంతిని అసలు ఎలా ఆడాలి అన్నట్లు బ్యాట్‌ కిందపడేసి స్టోక్స్‌ నిరాశ వ్యక్తం చేశాడు. చివరిగా అండర్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు బుమ్రా ముగింపు పలికాడు. 

 

ఎంత చెప్పినా తక్కువే

విశాఖ పిచ్‌ మీద శనివారం అతడి బంతుల విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే.  దూసుకొచ్చిన బంతులను ఆడలేక, ఆడితే నిలవలేక ఇంగ్లాండ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. ముఖ్యంగా రెండో స్పెల్‌లో అతను రెచ్చిపోయాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతి వేసి రూట్‌ను బుట్టలో వేసుకున్నాడు. స్టోక్స్‌ను నిశ్చేష్టుడిని చేస్తూ బౌల్డ్‌ చేశాడు. ప్రణాళిక ప్రకారం బంతిని ఆడేలా ప్రేరేపించి బెయిర్‌స్టోను ఔట్‌ చేశాడు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత కాస్త తడబడ్డ బుమ్రా.. ఇప్పుడు అత్యుత్తమ బౌలింగ్‌తో అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా బుమ్రా నిలిచాడు. అంతే కాదు అంతర్జాతీయ టెస్టుల్లో కనీసం 150 వికెట్లు తీసిన బౌలర్లలో అత్యుత్తమ సగటు పరంగా బుమ్రా (20.28) రెండో స్థానంలో ఉన్నాడు.

 

రెండో ఇన్నింగ్స్‌ కీలకం

వైజాగ్‌ టెస్ట్‌లో టీమిండియా(India) పట్టు బిగించే దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్‌(Yashasvi Jaiswal) డబుల్‌ సెంచరీతో 396 పరుగులు చేసిన రోహిత్ సేన... అనంతరం ఇంగ్లాండ్‌(England) జట్టును 253 పరుగులకే కుప్పకూల్చింది. బుమ్రా(Bumrah) పదునైన బంతులతో బ్రిటీష్‌ జట్టు పతనాన్ని శాసించాడు. ఆరు వికెట్లు నేలకూల్చి టీమిండియా విజయావకాశాలను మెరుగుపర్చాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా ఒక్క వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 13, జైస్వాల్‌ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌ జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేస్తుందన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.