ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న 2022 టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.  భారత ప్రధాన పేస్ బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు గాయం కారణంగా దూరం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టీ20లో కూడా జస్‌ప్రీత్ బుమ్రా ఆడలేదు. సర్జరీ అవసరం లేనప్పటికీ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టనుందని తెలుస్తోంది.


వెన్ను గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా అంతకుముందు ఈ సంవత్సరంలోనే జరిగిన ఆసియా కప్‌కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక నెల గడిపాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొహాలీలో జరిగిన మొదటి టీ20 తప్ప మిగిలిన 2 మ్యాచ్‌లు ఆడాడు.


భారత బెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరం అయ్యాడు. ఇప్పుడు బుమ్రా కూడా దూరం కావడంతో టీమిండియాకు మరో షాక్ అని చెప్పవచ్చు. వీరి గైర్హాజరు టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపించనుంది.


బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై ప్లేయర్‌లు ఉన్న మహ్మద్ షమీ లేదా దీపక్ చాహర్‌లను సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంటుంది.


టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా ఆడబోవడం లేదు. తనను వెన్ను సమస్య తీవ్రంగా వేధిస్తుంది. ఇది స్ట్రెస్ ఫ్యాక్చర్ కాబట్టి కనీసం ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యే అవకాశం ఉంది.’ అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.