Latest ICC Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్ము రేపాడు. తన కెరీర్ బెస్ట్ అయిన 908 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించాడు. గతంలో అత్యధిక ఎలో రేటింగ్ పాయింట్లు సాధించిన రికార్డు కూడా బుమ్రా పేరిట ఉంది. గతవారం ప్రకటించిన ర్యాంకుల్లో భారత బౌలర్లలోనే అత్యుత్తమంగా 907 రేటింగ్ ను దక్కించుకుని భారత ఎవర్ గ్రీన్ అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా పేరిట సంయక్తంగా ఉంది. అయితే తాజాగా ఈ రికార్డు బుమ్రా కీర్తి కిరీటంలో మణిలాగా చేరింది. ఇటీవల ఆస్ట్రేలియాలో ముగిసిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో బుమ్రా అత్యుత్తమంగా రాణించిన సంగతి తెలిసిందే. ఏకంగా 32 వికెట్లు సాధించి బీజీటీలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ హర్భజన్ సింగ్ రికార్డును సమం చేశాడు. 


సిడ్నీ టెస్టులో గాయం..
నిజానికి సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో బుమ్రా వెన్నునొప్పి గాయం బారిన పడ్డాడు. లేకపోతే రెండో ఇన్నింగ్స్ లోనూ బౌలింగ్ చేసేవాడు. మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసిన బుమ్రా.. ఆ తర్వాత గాయం కారణంగా డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యాడు. దీంతో భారత్ ఆ మ్యాచ్ లో ఆరు వికెట్లతో ఓడిపోయింది. బుమ్రా బౌలింగ్ చేసినట్లయితే ఫలితం వేరేలా ఉండేదని అభిమానులతో పాటు విశ్లేషకులు సైతం అంగీకరించారు. ఏదేమైనా మరో పాయింట్ పెంచుకుని టాప్ టెస్టు బౌలర్ ర్యాంకును మరింత పటిష్టం చేసుకున్నాడు. ఇక రెండో స్థానంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నాడు. సిడ్నీ టెస్లులో పది వికెట్లతో రాణించిన స్కాట్ బోలాండ్ కెరీర్ బెస్ట్ తొమ్మిదో ర్యాంకును దక్కించుకున్నాడు. పదుల సంఖ్యలో స్థానాలు మెరుగుపర్చుకుని తను ఈ ర్యాంకును సాధించాడు. మరో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా బోలాండ్ తో కలిసి ఉమ్మడిగా తొమ్మిదో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. 


టాప్ ఆల్ రౌండర్ గా జడేజా..
తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో జడేజా టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బీజీటీలో మూడు టెస్టులు ఆడిన జడేజా ఫర్వాలేదనిపించాడు. దీంతో తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. మరోవైపు బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ తొమ్మిదో ర్యాంకులో నిలిచాడు. సిడ్నీ టెస్టు రెండు ఇన్నింగ్స్ లలోనూ భారత్ తరపున పంత్ టాప్ స్కోరర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లలో 61 పరుగులు చేశాడు. దీంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. దీంతో పంత్ ర్యాంకు కూడా మెరుగు పడింది. ఇక టీ్ ర్యాంకింగ్స్ లో 2016 తరవాత తొలిసారి 3వ ర్యాంకుకు భారత్ దిగజారింది. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో 3-0తో, ఆసీస్ చేతిలో 3-1తో సిరీస్ లు ఓడిపోవడం భారత ర్యాంకును ప్రభావితం చేసింది. అదే సమయంలో వరుస విజయాలతో సౌతాఫ్రికా దూసుకెళ్లింది. ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో ఆసీస్, ప్రొటీస్, ఇండియా టాప్ త్రీలో ఉన్నాయి. 


Also Read: Viral Video: వై నాట్ హిమ్..? అతడిని బీజీటీలో ఎందుకు ఆడించలేదని బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్