T20 ప్రపంచ కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో ఇషాన్ కిషన్ రెండవ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. ఇషాన్ కిషన్ దాదాపు 2 సంవత్సరాల తర్వాత T20 జట్టుకు ఎంపికయ్యాడు. అది కూడా టీ20 వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీకి సెలక్ట్ అయ్యాడు. ఈ సమయంలో ఒక పోరాట కథ ఉంది. అతను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి చోటు కోల్పోయాడు. ఆపై తీవ్రంగా శ్రమించాడు. ఝార్ఖండ్ జట్టును సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ విజేతగా నిలిపాడు. ఇప్పుడు జట్టుకు ఎంపికైన  తర్వాత ఇషాన్ మొదటి స్పందన వచ్చింది.

Continues below advertisement

ఇషాన్ కిషన్ ఫస్ట్ రియాక్షన్ వైరల్

T20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లో ఎంపికైనందుకు వికెట్ కీపర్ బ్యాటర్, ప్యాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ చాలా సంతోషంగా కనిపించాడు. న్యూస్ ఏజెన్సీ ANIతో మాట్లాడుతూ "నేను చాలా సంతోషంగా ఉన్నాను. జట్టుతో కలవడానికి ఉత్సాహంగా ఉన్నాను" అని చెప్పాడు. గత కొంతకాలం నుంచి భారత జట్టు చాలా బాగా ఆడుతోందని అన్నాడు. 

ఫామ్‌తో జట్టులో చోటు..

ఇషాన్ కిషన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని కూడా షేర్ చేసి, "బ్యాక్, బెటర్" అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ఇషాన్ కిషన్ ఇటీవలి ఫామ్‌ను చూసి అతన్ని T20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లో ఎంపిక చేశారని, అయితే ఫామ్ లేమి కారణంగానే శుభ్‌మన్ గిల్ జట్టుకు దూరమయ్యాడు. 

T20 ప్రపంచ కప్‌నకు ముందు ఇషాన్ కిషన్ న్యూజిలాండ్‌తో జరిగే T20 సిరీస్‌తో జట్టులోకి తిరిగి వస్తాడు. వాస్తవానికి, శనివారం ప్రకటించిన జట్టు పొట్టి ప్రపంచ కప్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌ కూడా ఆడనుంది. అంటే ఈ T20 సిరీస్‌ జట్టుకు ఓ వార్మప్ లాంటిది. మొదటి మ్యాచ్ జనవరి 21న ప్రారంభం కాగా, చివరి మ్యాచ్ జనవరి 31న జరుగుతుంది.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతని కెప్టెన్సీలో జార్ఖండ్ మొదటి టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో శతకంతో ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ చేసిన మొదటి కెప్టెన్ గా నిలిచాడు. టోర్నమెంట్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ కూడా అతనే. అతను 10 ఇన్నింగ్స్‌లలో మొత్తం 517 పరుగులు చేశాడు.

T20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్పీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా. 

T20 ప్రపంచ కప్ 2026లో భారత్ షెడ్యూల్

  • ఫిబ్రవరి 07 - వర్సెస్ అమెరికా (ముంబై వేదికగా)
  • ఫిబ్రవరి 12 - వర్సెస్ నమీబియా (ఢిల్లీ వేదికగా)
  • ఫిబ్రవరి 15 - వర్సెస్ పాకిస్తాన్ (కొలంబో వేదికగా)
  • ఫిబ్రవరి 18 - వర్సెస్ నెదర్లాండ్స్ (అహ్మదాబాద్ వేదికగా)

T20 ప్రపంచ కప్ 2026 జట్లు

గ్రూప్ ఎ- భారతదేశం, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా, 

గ్రూప్ బి- ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్

గ్రూప్ సి- ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, బంగ్లాదేశ్, ఇటలీ

గ్రూప్ డి- న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా .