Ishan Kishan Reflects On Epic Double Century: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్‌పై 270 పరుగుల సంచలన డబుల్ సెంచరీతో విరుచుకుపడిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన అద్భుతమైన ఇన్నింగ్స్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్ల‌డించాడు. కెరీర్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న తర్వాత అనవసరపు ఆలోచనలు, అంచనాలను పక్కన పెట్టి పూర్తిగా బ్యాటింగ్‌పైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు.  సోమవారం ఆట ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కిషన్, "నేను మారడానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, సహజంగానే మార్పు వచ్చింది. ఇండియా జట్టుకు దూరమైనప్పుడు మన బాధ్యత కేవలం క్రీజులోకి వెళ్లి పరుగులు చేయడమేనని గుర్తించాను. కెరీర్‌కు ఉపయోగపడేది పరుగులు మాత్రమే. బయటి ఆలోచనలు మైండ్‌సెట్‌ను దెబ్బతీసి అనవసరపు ఒత్తిడిని పెంచుతాయి. జట్టును గెలిపించడం మీదే శ్రద్ధ పెట్టాలి" అని తెలిపాడు.

Continues below advertisement

Read Also: Sreesanth VS Sanju Samson, Kerala League Rift:  శ్రీశాంత్-సంజూ మ‌ధ్య విబేధాలు..!! వేదికపై షేక్ హ్యాండ్ ఇవ్వ‌ని శ్రీశాంత్.. వీడియో వైరల్

చీక‌టి రోజుల నుంచి వెలుగులోకి..2023 లో భారత్ తరఫున అన్ని ఫార్మాట్లు ఆడిన ఇషాన్ కిషన్, కొన్ని ఊహించని పరిణామాల వల్ల చివరకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను సైతం కోల్పోయాడు. అయితే నిరాశ చెందకుండా దేశవాళీ క్రికెట్‌లో క‌ఠోర సాధ‌న చేశాడు. 2025-26 రంజీ ట్రోఫీలో శతకాలతో పాటు, జార్ఖండ్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడంలో 517 పరుగులు చేసి రెండు సెంచరీలతో కీలక పాత్ర పోషించాడు. దాంతో మళ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్‌తో పాటు వైట్ బాల్ జట్టులో స్థానం పొందాడు. "ప్రస్తుతం నేను చేస్తున్న అత్యుత్తమ పని ఏమీ ఆలోచించకపోవడమే. బంతిని చూడటం, దానికి తగ్గట్లు ఆడటం తప్ప నాపై నేనే ఎలాంటి అంచనాలు పెట్టుకోవడం లేదు. సంయమనం కోల్పోయినప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే ముఖ్యం" అని పేర్కొన్నాడు.

Continues below advertisement

Read Also: Fatima Sana Fined: భారత ప్లేయర్లను క‌వ్వించిన‌ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా..  కొరడా ఝుళిపించిన ఐసీసీ

ప్ర‌త్యేక ప్రాక్టీస్..ఫైనల్ మ్యాచ్ వ్యూహాలను వివరిస్తూ, "సౌత్ జోన్‌తో మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సీవోఈలో రెడ్ బాల్‌తో ప్రత్యేక ప్రాక్టీస్ చేశాను. టీ20లు ఎక్కువగా ఆడినప్పుడు షాట్లు ఎక్కువగా ఆడాలనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో కట్ షాట్ ఆడబోయి ఔటయ్యాను. ఫైనల్లో ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇండియాకు ఆడిన అనుభవం ఉన్నప్పుడు జట్టు మన నుంచి భారీ స్కోరు ఆశిస్తుంది. అందుకే నా పార్ట్‌నర్‌తో కలిసి యాభై పరుగుల చొప్పున భాగస్వామ్యాలు నిర్మిస్తూ వికెట్ కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను" అని వ్యాఖ్యానించాడు.

డొమెస్టిక్ క్రికెట్ లో ఎంతో నేర్చుకోవ‌చ్చు..రెండు సంవత్సరాల పాటు గ్రౌండ్‌లో కష్టపడటం తనకు ఎంతో మేలు చేసిందని కిషన్ తెలిపాడు. భారత జట్టులో ఆడుతున్నప్పుడు ఒకే ఫ్లోలో వెళ్లిపోతామని, ఒక దశలో గ్రోత్ ఆగిపోతుందని పేర్కొన్నాడు. తిరిగి డొమెస్టిక్ క్రికెట్‌కు వచ్చినప్పుడు సున్నా నుంచి మళ్లీ ప్రారంభించాల్సి ఉంటుందని, స్టార్ట్స్ ను పెద్ద స్కోర్లుగా ఎందుకు మార్చలేకపోయామో సమీక్షించుకోవడానికి సమయం లభిస్తుందని వివరించాడు.