Rishabh Pant: గతేడాది డిసెంబర్ 31న   రోడ్డు ప్రమాదానికి గురైన భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్  రిషభ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.  బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఉన్న పంత్..  కర్రసాయం లేకుండా నడవడమే గాక    మెల్లిమెల్లిగా  వికెట్ కీపింగ్‌తో పాటు  బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. అయితే పంత్.. ఈ ఏడాది భారత్ వేదికగానే జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో ఆడతాడా..?  దీనిపై  ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్, భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మతో  పాటు మాజీ ఆటగాడు వసీం జాఫర్ కీలక అప్డేట్ ఇచ్చారు.


ఇప్పట్లో అయితే కష్టమే.. 


ఇషాంత్ శర్మ మాట్లాడుతూ.. పంత్ వన్డే వరల్డ్ కప్ సంగతి పక్కనబెడితే అసలు వచ్చే ఏడాది  జరుగబోయే ఐపీఎల్‌లో కూడా అతడు ఆడేది అనుమానమేనని చెప్పాడు. జియో సినిమాలో  జరిగిన చర్చలో భాగంగా ఇషాంత్ స్పందిస్తూ.. ‘రిషభ్ పంత్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం మామూలుది కాదు. అతడు ఇప్పుడిప్పుడే ఎన్సీఏలో బ్యాటింగ్,  వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.   ఒక వికెట్ కీపర్ గాయం నుంచి కోలుకోవాలంటే  చాలా కష్టపడాల్సి ఉంటుంది.  నాకు తెలిసి   పంత్ వచ్చే ఐపీఎల్ వరకూ  పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టమే.   అతడికి చాలా సీరియస్ ఇంజ్యూరీ అయింది’అని చెప్పాడు. 


 






‘పంత్ విషయంలో మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే..  అతడికి రెండోసారి సర్జరీ జరుగలేదు.  ఒకవేళ అదే జరిగుంటే మాత్రం అతడు చాలాకాలం పాటు బెడ్‌కే పరిమితమై ఉండేవాడు. వన్డే వరల్డ్ కప్‌లో అతడు ఆడేది అయితే  కచ్చితంగా కష్టమే. ఒకవేళ వచ్చే ఐపీఎల్ వరకు అతడు జట్టులోకి తిరిగొస్తే మాత్రం అది  చాలా   గొప్ప విషయం..’ అని  ఇషాంత్ చెప్పాడు.


 






వరల్డ్ కప్‌లో మరిచిపోవడమే.. 


ఇక పంత్ ఆరోగ్యంపై వసీం జాఫర్ స్పందిస్తూ.. ‘రిషభ్ కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది.  అతడిని ఆదరబాదరాగా టీమ్‌లోకి తీసుకురావడం కూడా సరికాదు.  భారత జట్టుకు అతడు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అంతేగాక  టీమిండియా  అతడిలో ఫ్యూచర్ కెప్టెన్‌ను చూస్తోంది.  పంత్ ఫుల్‌గా ఫిట్ అవడం చాలా ముఖ్యం.  అతడు  పూర్తి స్థాయిలో కోలుకోవడం కీలకం. రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో అతడు ఆడటం  అయితే అత్యాశే..’అని చెప్పుకొచ్చాడు. 


డిసెంబర్ 31న  ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్తుండగా రూర్కీ వద్ద  కారు డివైడర్‌కు ఢీకొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.  పంత్ కాలికి శస్త్ర చికిత్స  జరిగింది. గత ఐపీఎల్‌లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్‌లకు అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. 























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial