Ishan Kishan News: మూడు నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) రీఎంట్రీ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీ(DY Patil T20 Cup 2024)లో ఆకట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్.. రూట్ మొబైల్ లిమిటెడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో 12 బంతులాడి 19 పరుగులే చేసి ఇషాన్ అవుటయ్యాడు. 12 బంతుల్లో రెండు బౌండరీలు, ఒక భారీ సిక్సర్ సాయంతో 19 రన్స్ చేసిన ఇషాన్.. మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌కు మెరుపు అరంభమే లభించినప్పటికీ.. ఆతర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్.. రెండు ఫోర్లు, సిక్సర్‌తో దూకుడుగా ఆడేందుకు యత్నించినా అతడు ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయిన ఇషాన్.. వికెట్‌కీపింగ్‌లో పర్వాలేదనిపించాడు. ఓ క్యాచ్‌తో పాటు స్టంప్ ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రూట్ మొబైల్ లిమిటెడ్ నిర్ణీత ఓవర్లలో 192 పరుగలు చేయగా... ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.
దేశవాళీలో స్టార్ క్రికెటర్లు
ఐపీఎల్(IPL)లో వస్తున్న ఆదరణ, డబ్బుతో యువ క్రికెటర్లు రంజీ మ్యాచ్(Ranji Match)లు అంటేనే తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజీలు ఆడడానికి అయిష్టత చూపించిన ఇషాన్ కిషన్, శ్రేయస్స్ అయ్యర్... ఐపీఎల్ ఆడేందుకు మాత్రం సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు.. ఐపీఎల్ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని ఇషాన్, వెన్నునొప్పితో రంజీ ఆడని ఆయ్యర్‌పై బీసీసీఐ టీమ్ మేనేజ్‌మెంట్ ఆగ్రహంగా ఉంది. దేశవాళీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీఐ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు.
దారికొచ్చిన అయ్యర్, కిషన్
బీసీసీఐ హెచ్చరికలతో శ్రేయస్ అయ్యర్, కిషన్ ఎట్టకేలకు దారికొచ్చారు. సెమీస్‌లో భాగంగా ముంబై.. తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్.. రంజీ సెమీస్ ఆడనున్నట్టు తెలుస్తోంది. మార్చి మూడు నుంచి జరుగబోయే రంజీ సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ముంబై రంజీ టీమ్‌కు సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. రంజీ సెమీఫైనల్స్‌లో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని అయ్యర్ తెలిపినట్లు తెలుస్తోంది. అయ్యర్‌తో పాటు టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా స్వల్ప విరామం తర్వాత క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. నవంబర్‌లో ఆసిస్‌తో టీ20 సిరీస్ ఆడిన తర్వాత కిషన్ మళ్లీ గ్రౌండ్‌లోకి దిగాడు. బరోడాలో హార్ధిక్ పాండ్యాతో కలిసి కిరణ్ మోరే అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న ఇషాన్.. తాజాగా డీవై పాటిల్ టీ20 కప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ టోర్నీ తర్వాత ఇషాన్.. నేరుగా ఐపీఎల్ ఆడనున్నాడు.