IPL 2024 DC Coach: ఐపీఎల్-16 లో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడి తర్వాత పడుతూ లేస్తూ తంటాలు పడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఇదివరకే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నది. గత 4 సీజన్లుగా ఢిల్లీకి హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ ఈ సీజన్ లో మాత్రం తన మార్కును చూపలేకపోయాడు. ఢిల్లీ వరుస ఓటముల నేపథ్యంలో పాంటింగ్ ను మార్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
దాదానే కరెక్ట్..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు వచ్చే సీజన్ లో రికీ పాంటింగ్ ను గాక టీమ్ డైరెక్టర్ గా ఉన్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీకి ఆ బాధ్యతలు అప్పజెప్పాలని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
పఠాన్ మాట్లాడుతూ... ‘ఢిల్లీ డగౌట్ లో సౌరవ్ గంగూలీ ఉండటమే చాలా పెద్ద విషయం. నా అభిప్రాయం ప్రకారం దాదాకు ఢిల్లీ హెడ్‌కోచ్ పదవి అప్పగిస్తే అతడు జట్టులో చాలా తేడాను తీసుకొస్తాడు. భారత ఆటగాళ్ల సైకాలజీ దాదాకు బాగా తెలుసు. డ్రెస్సింగ్ రూమ్ ను విజయవంతంగా ఎలా నడిపించాలనేదానిపై దాదాకు మంచి అవగాహన ఉంది. పంజాబ్ తో మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్ కూడా తాము నెక్స్ట్ సీజన్ కు ప్రిపేర్ అవుతున్నామని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడే దాదాకు ఆ బాధ్యతలు అప్పజెప్పాలి. లేకుంటే ఢిల్లీ మరోసారి తప్పు చేసినట్టే అవుతుంది’ అని తెలిపాడు.
పాంటింగ్ పై గతంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. గత రెండు, మూడు సీజన్లలో ఢిల్లీ విజయాలలో క్రెడిట్ కొట్టేసిన పాంటింగ్.. తాజా సీజన్ లో అపజయాల క్రెడిట్ కూడా తీసుకోవాలని వ్యాఖ్యానించాడు.
కాగా ఈ సీజన్ లో 12 మ్యాచ్ లు (పంజాబ్‌తో ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ కాకుండా) ఆడి నాలుగింట మాత్రమే విజయం సాధించింది. 8 మ్యాచ్ లలో ఓడి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్ మొత్తం అత్యంత చెత్త ఆటతో విమర్శల పాలైన పృథ్వీ షా.. పంజాబ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. 38 బంతుల్లోనే 7 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 56 పరుగులు చేశాడు. రిలీ రూసో కూడా 37 బంతుల్లోనే 6 బౌండరీలు, ఆరు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.