SRH vs LSG Preview: ఐపీఎల్-16 సీజన్  లీగ్ దశ పోటీలు  లాస్ట్ స్టేజ్‌కు చేరకున్న వేళ  టాప్ -4  కోసం  వివిధ  జట్ల మధ్య  టఫ్ ఫైట్ నెలకొంది.  ప్రస్తుతం ఉన్న పాయింట్ల పట్టిక మేరకు  టాప్ -4 లేకున్నా లక్నో  సూపర్  జెయింట్స్ (5వ స్థానం) కు  ఇంకా ఆ ఛాన్స్ అయితే  ఉంది.  అయితే ఆ అవకాశాన్ని కోల్పోవద్దంటే  నేడు హైదరాబాద్ వేదికగా  సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగబోయే  మ్యాచ్ ఆ జట్టుకు చాలా కీలకంగా మారింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్ లో గెలిచినోళ్లకే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ మెరుగుపడతాయి.


కూర్పు కుదరక.. 


ఈ సీజన్ లో  11 మ్యాచ్‌లు ఆడిన లక్నో ఐదు గెలిచి ఐదింట ఓడింది.  ఏప్రిల్ 28న పంజాబ్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా చెన్నైతో పోరు వర్షం కారణంగా అర్థాంతరంగా ముగియగా  బెంగళూరు, గుజరాత్ లతో దారుణంగా ఓడింది. కెఎల్ రాహుల్‌కు గాయం కారణంగా ఆ జట్టు కూర్పు దెబ్బతింది. గుజరాత్ తో మ్యాచ్ లో వచ్చిన ఓపెనర్  క్వింటన్ డికాక్, మరో ఓపెనర్  కైల్ మేయర్స్ ఫర్వాలేదనిపిస్తున్నా దీపక్ హుడా విఫలమవుతున్నాడు.  పంజాబ్ ‌తో మ్యాచ్ తర్వాత  స్టోయినిస్, పూరన్ ల నుంచి భారీ ఇన్నింగ్స్ రాలేదు. బదోని  ఆడుతున్నా అతడికి  ఇన్నింగ్స్ ముగుస్తందనగా బ్యాటింగ్ కు పంపుతుండటంతో  అతడు పూర్తిస్థాయిలో రెచ్చిపోలేకపోతున్నాడు. గత మూడు మ్యాచ్ లలో కృనాల్ పాండ్యా  సున్నాలకే పరిమితమయ్యాడు.   బౌలింగ్ లో  కూడా అవేశ్ ఖాన్ భారీగా పరుగులిచ్చుకుంటున్నాడు.  


బ్యాటింగే ప్రధాన సమస్య.. 


సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగే ప్రధాన సమస్య. ఈ సీజన్ లో   బౌలర్లు  బాగా  ఆడి ప్రత్యర్థులను తక్కువ పరుగులకే కట్టడి చేసినా  బ్యాటింగ్ వైఫల్యంతో  హైదరాబాద్  మూడు నాలుగు మ్యాచ్ లను చేజేతులా  ఓటమి కొనితెచ్చకుంది. వరుసగా విఫలమవుతున్న బ్రూక్, అగర్వాల్ లను కాదని పంజాబ్ తో మ్యాచ్ లో  సన్ రైజర్స్ అమోల్‌ప్రీత్, అభిషేక్ శర్మలతో ఓపెనింగ్  చేయించింది. ఈ ఇద్దరూ  సన్ రైజర్స్ శిబిరంలో కొత్త ఆశలు నింపారు.  లాస్ట్ మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠి కూడా టచ్  లోకి వచ్చినట్టే కనిపించాడు. కెప్టెన్ మార్క్‌రమ్ ఇంకా కుదురుకోలేదు. హెన్రిచ్ క్లాసెన్  నిలకడగా బాదుతుండగా ఈ మ్యాచ్ లో కూడా అదే కొనసాగాలని  హైదరాబాద్ కోరుకుంటున్నది. లాస్ట్ మ్యాచ్ హీరోలు గ్లెన్ ఫిలిప్స్,  అబ్దుల్ సమద్ లు కూడా కాస్త చెయ్యి వేస్తే  హైదరాబాద్‌కు తిరుగుండదు.


 






ప్లేఆఫ్స్  ఫైట్.. 


ఈ మ్యాచ్ లో ఓడితే  లక్నో  ప్లేఆఫ్ ఆశలు దాదాపు  అడుగంటినట్టే. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఆ జట్టు నేటి మ్యాచ్ తో పాటు రాబోయే  రెండు మ్యాచ్ లలోనూ గెలిస్తేనే ముంబై, రాజస్తాన్ లకు గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది. లేదంటే  అంతే..! ఇక హైదరాబాద్ విషయానికొస్తే ప్రస్తుతం ఆ జట్టు ఉన్న పొజిషన్  (9వ స్థానం)ను బట్టి ప్లేఆఫ్స్ రేసులో నిలవడం కష్టమే గానీ  ఏదైనా అద్భుతం జరిగితే  తప్ప  దానికి ఛాన్స్ లేదు. ఆ అద్భుతానికి నేడు హైదరాబాదే వేదికైతే ఇంకా సంతోషమే.. 


సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.


లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, కరుణ్ నాయర్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్.