IPL 2023, MI vs RCB: ముంబై ఇండియన్స్‌తో వాంఖెడే వేదికగా జరుగుతున్న  మ్యాచ్‌లో  రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు  బ్యాటింగ్ తీరు మారలేదు.  ఈ సీజన్ ఆరంభం నుంచి  కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) మీద విపరీతంగా ఆధారపడుతున్న  ఆ జట్టు  నేటి మ్యాచ్ లో కూడా అదే  ఫాలో అయింది.  ముంబైతో కోహ్లీ కూడా విఫలం కాగా మ్యాక్స్‌వెల్ (33 బంతుల్లో  68, 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (41 బంతుల్లో  65, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లతో పాటు చివర్లో దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో  నిర్ణీత 20 ఓవర్లలో  ఆర్సీబీ.. 6 వికెట్లు కోల్పోయి  199 పరుగులు చేసింది.  ముంబై  విజయానికి  20 ఓవర్లలో 200 పరుగులు కావాలి. 


ప్లేఆఫ్స్ చేరాలంటే  కీలకమని భావిస్తున్న మ్యాచ్‌లో రన్ మిషీన్ విరాట్ కోహ్లీ (1) విఫలమయ్యాడు.  బెహ్రన్‌డార్ఫ్ వేసిన  ఫస్ట్ ఓవర్‌లో ఐదో బంతికి కోహ్లీ.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు.  వన్ డౌన్ లో వచ్చిన అనూజ్ రావత్  (6)ను కూడా బెహ్రన్‌‌‌డార్ఫ్ మూడో ఓవర్లో  రెండో బాల్ కు ఔట్ చేశాడు. 


కే మిస్ అయినా జీఎఫ్ కొట్టారు.. 


నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి  డుప్లెసిస్  ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు. ఇద్దరూ కలిసి  మూడో వికెట్ కు 62 బంతుల్లోనే 120 పరుగులు రాబట్టారు. ఇరువురూ ముంబై బౌలర్లను పవర్ ప్లేతో పాటు  మిడిల్ ఓవర్స్ లో కూడా ఆటాడుకున్నారు. ప్రతి ఓవర్‌కు ఓ సిక్స్, ఫోర్‌కు తగ్గకుండా బాదారు.  ఆకాశ్ మధ్వాల్ వేసిన  పదో ఓవర్లో  మ్యాక్స్‌వెల్..  ఓ ఫోర్ కొట్టి ఆ మరుసటి బంతికి సింగిల్ తీసి 25 బంతుల్లోనే హాఫ్  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో డుప్లెసిస్ కూడా భారీ సిక్సర్ బాదడంతో  పది ఓవర్లు ముగిసేసరికి  ఆర్సీబీ స్కోరు  100 దాటింది. జోర్డాన్ వేసిన  11 వ ఓవర్లో  నాలుగో బాల్‌కు డుప్లెసిస్ కవర్స్ దిశగా సింగిల్ తీసి   ఈ సీజన్ లో ఆరో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  


 






బ్రేక్ ఇచ్చిన బెహ్రన్‌డార్ఫ్.. 


భారీ స్కోరు దిశగా సాగుతున్న ఈ  జోడీని బెహ్రన్‌డార్ఫ్ విడదీశాడు. అతడు వేసిన  13వ ఓవర్లో రెండో బాల్ బౌండరీ కొట్టిన మ్యాక్స్‌వెల్.. మరుసటి బంతికే  నెహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  దాంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ మళ్లీ  పట్టాలు తప్పింది. మ్యాక్స్‌వెల్ ప్లేస్ లో వచ్చిన మహిపాల్ లోమ్రర్ (1) కార్తీకేయ వేసిన 14వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు.  ఆ తర్వాతి ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్.. డుప్లెసిస్‌ను ఔట్ చేశాడు.  


ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయడంలో విఫలమవుతున్న దినేశ్ కార్తీక్ ఫర్వాలేదనిపించాడు. కానీ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో ఫస్ట్ బాల్ కే  అతడు  వధేరకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.  కేదార్ జాదవ్ (12 నాటౌట్), హసరంగ (12 నాటౌట్) లు  ఆర్సీబీ స్కోరును 200 మార్కుకు  చేర్చలేకపోయారు.