MI vs RCB: ఐపీఎల్-16లో  నేడు మరో బిగ్గెస్ట్ రైవల్రీకి తెరలేచింది.  ఈ లీగ్ లో మోస్ట్ పాపులర్ టీమ్స్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ఆర్సీబీ)తో  ఐదు సార్లు  ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ (ఎంఐ)  తలపడుతున్నది. ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్   టాస్ గెలిచి  మొదట బౌలింగ్ ఎంచుకుంది.  డుప్లెసిస్  నేతృత్వంలోని ఆర్సీబీ బ్యాటింగ్‌కు రానుంది.  ప్లేఆఫ్స్ రేసులో  ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది.  


గెలిచిన జట్టు థర్డ్ ప్లేస్‌కు..


ఈ సీజన్ లో ఇప్పటివరకు  ముంబై, బెంగళూరు జట్లు  పది మ్యాచ్‌లు ఆడి  ఐదు గెలిచి ఐదింట్లో ఓడి  పది పాయింట్లతో ఉన్నాయి. నెట్ రన్ రేట్ విషయంలో ఆర్సీబీది కాస్త పైచేయిగా  ఉండటంతో  పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఆరో స్థానంలో ఉండగా   ముంబై 8వ స్థానంలో ఉంది.  కానీ నేటి మ్యాచ్ లో గెలిచిన జట్టు ఎకాఎకిన థర్డ్ ప్లేస్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. 


ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా చెన్నై  13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.  లక్నో  11 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా  రాజస్తాన్, కోల్‌కతా, బెంగళూరు, పంజాబ్, ముంబైలు పది పాయింట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ముంబై - బెంగళూరు మధ్య  జరిగే పోరులో గెలిచే విజేత  12 పాయింట్లతో  ఏకంగా లక్నోను దాటి మూడో స్థానానికి వెళ్లే అవకాశం ఉండటంతో  నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహమే లేదు.  


ఫస్ట్ మ్యాచ్‌కు రివేంజ్ కూడా.. 


ఆర్సీబీకి  ప్లేఆఫ్స్ ఒక్కటే గురికాగా ముంబైకి రెండు లక్ష్యాలున్నాయి.  ఈ మ్యాచ్ గెలవడంతో  పాటు ఈ సీజన్ ఆరంభంలో చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ముంబైకి అవమానకర ఓటమి ఎదురైంది. ఆ మ్యాచ్‌లో ముంబై  ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి  171 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యాన్ని ఆర్సీబీ.. 16.2 ఓవర్లలోనే అందుకుంది. ఈ ఓటమికి బదులు తీర్చుకోవాలని  ముంబై పట్టుదలతో ఉంది.  వాంఖెడేలో  ఆర్సీబీపై  గత  ఐదు మ్యాచ్‌లలో ఐదుసార్లు గెలిచిన ముంబైదే ఆధిక్యం. అంతేగాక  ఐపీఎల్‌లో ఆర్సీబీ, ఎంఐ ఇప్పటి వరకు 31 సార్లు తలపడ్డాయి. ఇందులో 17-13తో హిట్‌మ్యాన్‌ సేనదే పైచేయిగా ఉంది. 


 






తుది జట్లు : ఈ మ్యాచ్ కోసం  ఇరు జట్లూ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఫిట్‌నెస్ సమస్యలతో  ఇబ్బందిపడుతున్న జోఫ్రా ఆర్చర్ స్థానంలో జోర్డాన్ ముంబైకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్సీబీ తరఫున కర్ణ్ శర్మ  ప్లేస్ లో  వైశాఖ్ తుది జట్టులో చేరాడు. 


ముంబై ఇండియన్స్ :   రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్,  సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్,  నెహల్ వధేర, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వల్,  కుమార్  కార్తికేయ,  జేసన్ బెహ్రన్‌డార్ఫ్ 


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ,  ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్),  అనూజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, విజయ్ కుమార్ వైశాఖ్, మహ్మద్  సిరాజ్, జోష్ హెజిల్వుడ్