KL Rahul in IPL: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, ఆ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో తన పేరిట మరో రికార్డును  జత చేసుకున్నాడు. ఈ లీగ్‌లో  అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న  ఆటగాడిగా రాహుల్ రికార్డులకెక్కాడు.  ఐపీఎల్-2023 ఎడిషన్‌లో  భాగంగా  శనివారం లక్నో  సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో రాహుల్  ఈ ఘనత సాధించాడు.  


లక్నోలోని శ్రీ  అటల్ బిహారి వాజ్‌పేయి ఏకన  స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో 25 పరుగులు పూర్తి చేయగానే రాహుల్.. ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇందుకు గాను  అతడు 105 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో  రాహుల్.. క్రిస్ గేల్  (112 ఇన్నింగ్స్),  డేవిడ్ వార్నర్ (114), విరాట్ కోహ్లీ (128), ఏబీ డివిలియర్స్ (131) లు  రికార్డులను  అధిగమించాడు. 


రాహుల్ ప్రస్థానమిది.. 


ఐపీఎల్‌లో  2013 నుంచి ఆడుతున్న రాహుల్.. ఇప్పటివరకు నాలుగు  ఫ్రాంచైజీలు మారాడు.  సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌కు ఆడిన  రాహుల్.. ప్రస్తుతం లక్నోకు ఆడుతున్నాడు.  ఇప్పటివరకు  114 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 105 ఇన్నింగ్స్‌లలో 4,044 పరుగులు  సాధించాడు.  ఈ క్రమంలో అతడి సగటు 47.02 గా ఉండగా  స్ట్రైక్ రేట్ 135.16గా ఉంది.  ఐపీఎల్‌లో రాహుల్ పేరిట 4 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించినవారిలో  రాహుల్.. 14 వ స్థానంలో ఉన్నాడు.  


 






లక్నో ఓటమి.. 


లక్నో - పంజాబ్ మధ్య శనివారం ముగిసిన  మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  రాహుల్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.  రాహుల్.. 56 బంతుల్లో  8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో  74 పరుగులు చేశాడు.  కైల్ మేయర్స్  (29)  ఫర్వాలేదనిపించగా మిగిలినవారు విఫలమయ్యారు.   పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం  160 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్.. 45 పరుగులకే 3  వికెట్లు నష్టపోయినా  సికిందర్ రజా (41 బంతుల్లో  57, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మాథ్యూ షార్ట్  (22 బంతుల్లో 34, 5 ఫోర్లు, 1 సిక్స్)‌కు తోడుగా చివర్లో షారుక్ ఖాన్ 10 బంతుల్లోనే ఒక ఫోర్, 2 భారీ సిక్సర్లతో   మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ ఓటముల తర్వాత పంజాబ్‌కు ఇదే విజయం.  


కాగా  ఈ మ్యాచ్‌లో  ఓటమి పాలైనా పాయింట్ల పట్టికలో లక్నో  రెండో స్థానాన్ని కాపాడుకుంది.  ఎల్ఎస్‌జీ.. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి మూడింట్లో గెలిచి  రెండు ఓడిపోయింది.  తద్వారా  ఆ జట్టు ఖాతాలో  ఆరు పాయింట్లున్నాయి.  ఈ జాబితాలో రాజస్తాన్ రాయల్స్  అగ్రస్థానంలో ఉంది. రాజస్తాన్.. 4 మ్యాచ్‌లలో మూడు గెలిచి ఒకదాంట్లో ఓడి  ఆరు పాయింట్లతోనే ఉన్నా.. ఆ జట్టు నెట్ రన్ రేట్  (+1.588).. లక్నో (+0.761) కంటే మెరుగ్గా ఉంది.  ఈ జాబితాలో  గుజరాత్, పంజాబ్, కేకేఆర్‌లు టాప్ -5 లో ఉన్నాయి.