Yashasvi Jaiswal: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత వేగవంతమైన  అర్థ సెంచరీ సాధించిన  రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటపై ప్రశంసలు  కురుస్తున్నాయి. ఇన్నాళ్లూ తన పేరిట ఉన్న రికార్డును  బ్రేక్ చేసినందుకు గాను కెఎల్ రాహుల్ (14 బంతులలో హాఫ్ సెంచరీ).. జైస్వాల్ కు  సాల్యూట్ చేస్తున్నట్టుగా ట్విటర్ లో జిఫ్ ఇమేజ్‌ను షేర్ చేశాడు.  


కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో గురువారం  రాత్రి ముగిసిన మ్యాచ్‌లో జైస్వాల్..  13 బంతులలోనే హఫ్ సెంచరీ చేశాడు. నితీశ్ రాణా వేసిన ఫస్ట్ ఓవర్ లోనే రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో పాటు ఓ డబుల్ తో 26 పరుగులు చేసిన  జైస్వాల్.. తర్వాత ఏడు బంతులలో 1, 4, 6, 4, 4, 4, 1  పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.


మొత్తంగా నిన్నటి మ్యాచ్ లో 47 బంతుల్లోనే  13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన  జైస్వాల్ పై కెఎల్ రాహుల్ తో పాటు నయా 360 సూర్యుకుమార్ యాదవ్  కూడా ట్విటర్‌లో  ప్రశంసలు కురిపంచాడు. ‘స్పెషల్ నాక్, స్పెషల్ ప్లేయర్. టేక్ ఎ బో జైస్వాల్’ అని ట్వీట్ చేశాడు. 


 






ఇక ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అయితే  యశస్విని  భారత్ త్వరలో ఆస్ట్రేలియాతో ఆడబోయే  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఆడించాలని సూచించాడు.  ట్విటర్ వేదికగా వాన్ స్పందిస్తూ.. ‘నేనే గనక సెలక్టర్ అయితే  గాయపడ్డ కెఎల్ రాహుల్ ప్లేస్ లో  యశస్వి జైస్వాల్‌ను  డబ్ల్యూటీసీ  ఫైనల్స్‌కు సెలక్ట్ చేస్తా.   అంత గొప్ప ఆటగాడు అతడు.  రాబోయే రోజుల్లో అతడే సూపర్ స్టార్ అవుతాడు..’అని  ప్రశంసల్లో ముంచెత్తాడు.  


 






జైస్వాల్ ఆటకు  టీమిండియా  రన్ మిషీన్ విరాట్ కోహ్లీ కూడా ముగ్దుడయ్యాడు. నిన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన కొద్దిసేపటికే కోహ్లీ  తన  ఇన్‌స్టా  స్టోరీస్ లో ‘వావ్.. నేను చూసిన  ఇన్నింగ్స్ లలో ఇది బెస్ట్. వాట్ ఎ టాలెంట్ @యశస్వి జైస్వాల్’అని   పోస్ట్ చేశాడు.  టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా  ట్విటర్ లో ‘ఈ కుర్రాడు చాలా స్పెషల్.  అతడి క్లీన్ హిట్టింగ్‌ను ఆసాంతం ఆస్వాదించా..’అని  పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలైతే  యశస్విపై  ట్వీట్ల వర్షం కురిపించాయి. ఇందుకు సంబంధించిన  వీడియోను ఐపీఎల్, రాజస్తాన్ రాయల్స్ ట్విటర్ లో షేర్ చేసింది.