Yashasvi Jaiswal: ‘ఊరు మారితే పడుకునే బెడ్ మారుద్ది. తినే ఫుడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుద్ది రా బ్లడీ ఫూల్..’ ఇది లెజెండ్ సినిమాలో బాలయ్య డైలాగ్. ఇదే డైలాగ్‌ను ఐపీఎల్-16లో వీరబాదుడు బాదుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెబితే.. ‘ఫార్మాట్ మారితే బాల్ రంగు మారుద్ది.. వేసుకునే జెర్సీ మారుద్ది.. నా బాదుడు ఎలా మారుద్దిరా బ్లడీ ఫూల్..’ అన్న రేంజ్‌లో సాగుతోంది అతడి విధ్వంసం. అంతేకాదు.. టోర్నీ ఏదైనా, గ్రౌండ్ ఎక్కడైనా, బౌలర్ ఎవరైనా నేను బరిలోకి దిగనంతవరకే..! వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటున్నాడీ ముంబై కుర్రాడు.
21 ఏండ్ల ఈ ముంబై బ్యాటర్ ఐపీఎల్-16లో ఆడింది 12 మ్యాచ్‌లు. కానీ 52.27 సగటుతో 575 పరుగులు చేసి (ఇందులో ఒక సెంచరీ, 4 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రపంచంలోనే టీ20లలో ‘ది బెస్ట్ హిట్టర్’ అన్న పేరు ఉన్న జోస్ బట్లర్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో నిలబెట్టి మరీ వీరబాదుడు బాదుతున్నాడంటే ఈ కుర్రాడి గట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.
టోర్నీ ఏదైనా సెంచరీల మోతే..
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (13 బంతుల్లో) నమోదుచేసిన జైస్వాల్ గడిచిన రెండు మూడేండ్లుగా నిలకడగా ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడు సెంచరీ చేయని టోర్నీ లేదంటే అతిశయోక్తి కాదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు లిస్ట్-ఎ క్రికెట్ లోనూ డబుల్ హండ్రెడ్ సాధించిన జైస్వాల్ భారత్ తరఫున అండర్ -19 వరల్డ్ కప్ లో కూడా సెంచరీ చేశాడు.
దేశవాళీలో భాగంగా బీసీసీఐ నిర్వహించే రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలలోనూ యశస్వికి సెంచరీలున్నాయి. ఇండియా ‘ఎ’ జట్టు తరఫున కూడా జైస్వాల్ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో ఇటీవలే ముంబై ఇండియన్స్‌పై శతకం చేసిన యశస్వి.. తాజాగా కేకేఆర్ తో మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రేపో మాపో భారత జట్టులోెకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న జైస్వాల్ భవిష్యత్ లో మరెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో..!
ఐపీఎల్‌లో జైస్వాల్ ప్రస్థానం..
అండర్ -19 వరల్డ్ కప్ లో జైస్వాల్ ఆట చూసి ముచ్చటపడ్డ రాజస్తాన్ యాజమాన్యం అతడిని 2020 ఐపీఎల్ వేలంలో రూ. 2.40 కోట్లతో కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 3 మ్యాచ్‌లే ఆడిన జైస్వాల్.. 40 పరుగులే చేశాడు. 2021లో 10 మ్యాచ్‌లు ఆడి 249 పరుగులే చేయగా 2022లో కూడా 258 పరుగులే చేసి పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సీజన్‌కు ముందు దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన జైస్వాల్.. ఇప్పటికే 12 మ్యాచ్ లలో 575 పరుగులు సాధించి టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.
కోల్‌కతా - రాజస్తాన్ మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది. లక్ష్యాన్ని రాజస్తాన్ రాయల్స్ 13.1 ఓవర్లలోనే దంచేసింది. ఆ జట్టు యువ సంచలనం యశస్వి జైస్వాల్.. 47 బంతుల్లోనే 13 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 98 పరుగులతో నాటౌట్ గా నిలిచి రాజస్తాన్‌కు ఈజీ విక్టరీని అందించాడు.