DC vs GT 2nd Innings Highlights: ఐపీఎల్ - 16లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ సీజన్‌లో పేరుకు తగ్గట్టే ఛాంపియన్‌లా దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో చెన్నైని ఓడించిన పాండ్యా సేన.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీకి కూడా ఓటమి రుచి చూపించింది. ఢిల్లీ తమ ముందు నిలిపిన 163 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు విఫలమైనా సాయి సుదర్శన్ (48 బంతుల్లో 62 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడకు తోడు ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (16 బంతుల్లో 31 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకుంది. గుజరాత్ బ్యాటర్లను తొలుత కాస్త ఇబ్బందిపెట్టిన ఢిల్లీ బౌలర్లు తర్వాత తేలిపోయారు. ఫలితంగా ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత సొంతగడ్డపై ఓడిపోయిన రెండో జట్టుగా నిలిచారు.
ఢిల్లీ నిర్దేశించిన మోస్తారు లక్ష్య ఛేదనలో గుజరాత్ ఇన్నింగ్స్ ధాటింగా ఆరంభమైంది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (7 బంతుల్లో 14, 2 ఫోర్లు, 1 సిక్సర్).. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 14 పరుగులు రాబట్టాడు. ముఖేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో గిల్ (13 బంతుల్లో 14, 3 ఫోర్లు) కూడా రెండు బౌండరీలు సాధించాడు.
బ్రేక్ ఇచ్చిన నోర్జే..
ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన గుజరాత్‌కు ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే తొలి షాకిచ్చాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో తొలి బంతికే సాహా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తన తర్వాతి ఓవర్లో.. గిల్ ను కూడా సీమ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అంచనా వేయడంలో గురి తప్పిన గిల్.. వికెట్‌ను పారేసుకున్నాడు. గిల్ స్థానంలో వచ్చిన గుజరాత్ సారథి హార్ధిక్ పాండ్యా (4)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ కష్టాల్లో పడింది.
ఆదుకున్న సాయి సుదర్శన్..
వన్ డౌన్‌లో వచ్చిన సుదర్శన్.. నోర్జే వేసిన ఐదో ఓవర్లో ఓ భారీ సిక్సర్ బాదాడు. తర్వాత ఖలీల్ వేసిన ఆరో ఓవర్లో బౌండరీ బాదినా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. పాండ్యా నిష్క్రమించిన తర్వాత జోషువా లిటిల్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన విజయ్ శంకర్ (23 బంతుల్లో 29, 3 ఫోర్లు) సాయంతో గుజరాత్‌ను నడిపించాడు. తొలి పవర్ ప్లే తర్వాత గుజరాత్ స్కోరు వేగం కూడా తగ్గింది. శంకర్ - సుదర్శన్ లు ధాటిగా ఆడకున్నా వికెట్ కోల్పోకుండా నిలబడ్డారు. వీరిద్దరూ మరీ నెమ్మదిగా ఆడటంతో 6 ఓవర్లలోనే 50కి చేరిన గుజరాత్ స్కోరు.. 13 ఓవర్ లో వందకు చేరింది. అయితే క్రీజులో కుదురకున్న శంకర్‌ను మిచెల్ మార్ష్.. 14వ ఓవర్లో రెండో బంతికి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
కిల్లర్ మిల్లర్ షో..
గుజరాత్ సాధించే లక్ష్యం తాలూకూ రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతుండటంతో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్.. వస్తూనే బాదడం స్టార్ట్ చేశాడు. ముఖేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో 6, 6, 4 సాధించాడు. ఈ ఓవర్లో గుజరాత్‌కు 20 పరుగులొచ్చాయి. ఆ మరుసటి ఓవర్లో మూడో బంతికి బౌండరీ సాధించడం ద్వారా సాయి హాఫ్ సెంచరీ (44 బంతుల్లో) పూర్తైంది. నోర్జే వేసిన అదే ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్ బాదడం ద్వారా గుజరాత్ స్కోరు 150 దాటింది. ఆ తర్వాత ఖలీల్ వేసిన ఓవర్లో పది పరుగులొచ్చాయి. మార్ష్ వేసిన 19వ ఓవర్లో రెండు పరుగులు తీసిన మిల్లర్ గుజరాత్ విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 37, 7 ఫోర్లు), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 36, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (34 బంతుల్లో 30, 2 ఫోర్లు) లు రాణించారు.