DC vs SRH Preview: ఐపీఎల్-16 లో రెండు మ్యాచ్‌లు గెలిచి మళ్లీ ఓటముల బాట పట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణ వైఫల్యాలతో  ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంటున్న తరుణంలో  నేడు ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల  మధ్య  నేటి రాత్రి 7.30 గంటలకు  మ్యాచ్ జరుగనుంది. 


సన్ ‘రైజ్’ అవ్వాల్సిందే.. 


ఈ సీజన్ ను వరుసగా రెండు  ఓటములతో స్టార్ట్ చేసి ఆ తర్వాత పంజాబ్, కోల్‌కతాను ఓడించిన హైదరాబాద్ జట్టు మళ్లీ ఆ తర్వాత ఓటముల బాట పట్టింది. వరుసగా  మూడు మ్యాచ్ లలో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై, చెన్నైలతో పాటు గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్  నిర్దేశించిన 145 లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.  బ్యాటింగ్ వైఫల్యాలు  సన్ రైజర్స్‌ను దారుణంగా వేధిస్తున్నాయి.    హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ లు దారుణంగా విఫలమవుతున్నారు. గుడ్డిలో మెల్లలా హెన్రిచ్ క్లాసెన్  ఆడుతున్నా అతడి ఆట  మ్యాచ్ ను గెలిపించేదైతే కాదు. మరి ఈ మ్యాచ్ లో అయినా సన్ రైజర్స్ బ్యాటింగ్ రైజ్ అవుతుందో లేదో చూడాలి. 


బౌలింగ్ లో  సన్ రైజర్స్ పటిష్టంగానే ఉంది. కొత్తబంతితో భువనేశ్వర్, జాన్సేన్ లు రాణిస్తున్నారు. నటరాజన్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఢిల్లీతో గత మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన చేసిన  వాషింగ్టన్ సుందర్ లేకపోవడం ఎస్ఆర్‌హెచ్ కు ఇబ్బందే.  స్పిన్ బాధ్యతలను మయాంక్ మార్కండే   ఏ మేరకు  నెరవేరుస్తాడో చూడాలి. 


 






హ్యాట్రిక్ మీద కన్నేసిన ఢిల్లీ.. 


ఐపీఎల్ -16లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడి  కోల్కతాను ఓడించి గెలుపు బాట పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ ను ఓడించి షాకిచ్చింది. నేడు అదే జట్టుతో మరో మ్యాచ్ జరుగుతుండటంతో మరోసారి హైదరాబాద్ కు షాక్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఈ మ్యాచ్ గెలిస్తే ఢిల్లీకి హ్యాట్రిక్ తో పాటు  పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి బయటపడొచ్చు.  అయితే అదంతా ఈజీ అయితే కాదు. ఆ జట్టులో డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ తప్పితే మిగిలిన బ్యాటర్లు ‘రావడం.. పోవడం’ వరకే పరిమితమవుతున్నారు. పృథ్వీ షా ను తప్పించి ఫిల్ సాల్ట్ ను ఓపెనర్ గా పంపిస్తే అతడు కూడా రాణించలేదు. మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్.. ఇలా ఆ జట్టు వైఫల్యాల చిట్టా పెద్దదే. 


గత రెండు మ్యాచ్ లలో ఢిల్లీ గెలిచిందంటే అది బౌలర్ల చలవే.   కొత్త బంతితో ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, నోర్జే ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు.  అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంతో  రాణిస్తుండటం  ఢిల్లీకి కలిసొచ్చేదే. 


 






పిచ్ రిపోర్టు :  అరుణ్ జైట్లీ స్టేడియం స్లో టర్నర్.  గత మ్యాచ్ లో ఇక్కడ కేకేఆర్ ను ఢిల్లీ స్పిన్నర్లు ఆటాడుకున్నారు.   బౌండరీ లైన్ చిన్నగా ఉండే ఈ స్టేడియంలో   నిలిస్తే భారీ స్కోర్లు చేయడం పక్కా. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కే మొగ్గు చూపుతున్నది. 


హెడ్ టు హెడ్ : సన్ రైజర్స్ - ఢిల్లీ మధ్య ఇప్పటివరకు  22 మ్యాచ్ లు జరుగగా  ఇరు జట్లు తలా 11 మ్యాచ్ లు గెలిచాయి. 


తుది జట్లు  (అంచనా) : 


సన్ రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్),రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్‌సేన్, అబ్దుల్ సమద్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్  


ఢిల్లీ క్యాపిటల్స్ :   డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీష్ పాండే,  సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపల్ పటేల్, అన్రిచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ