CSK vs SRH Preview: ఐపీఎల్-16లో  అన్ని జట్లూ తమ హనీమూన్ పీరియడ్‌ (గెలిచినా ఓడినా పెద్దగా పట్టించుకోకపోవడం) ను ముగించుకుని సీరియస్‌నెస్‌కు వచ్చాయి.  ఈ సీజన్‌లో ఇప్పటికే అన్ని టీమ్స్ ఐదేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇకనుంచి టోర్నీలో ఆడబోయే  మ్యాచ్‌లలో ఫలితాలు  ప్లేఆఫ్స్ చేరే విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో  ఐదు మ్యాచ్‌లు ఆడి  రెండింట్లో మాత్రమే గెలిచి  మూడు మ్యాచ్‌లలో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. నేడు (శుక్రవారం)  చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.   రెండు విజయాల తర్వాత ముంబైతో మ్యాచ్‌లో ఓడిన  ఆరెంజ్ ఆర్మీ తిరిగి గాడిలో పడేనా..?  


వాళ్లు రాణిస్తేనే.. 


పేపర్‌పై చూస్తే సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ రాక్ సాలిడ్ గా ఉంది. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి,  ఎయిడెన్ మార్క్‌రమ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ తో పాటు వాషింగ్టన్ సుందర్ వరకూ అందరూ హిట్టర్లే.  కానీ కీలక సందర్బాల్లో చేతులెత్తేసే  బలహీనతతో  హైదరాబాద్ కు తిప్పలు తప్పడం లేదు.  హైదరాబాద్  మూడు మ్యాచ్ లలో ఓడగా అవి స్పష్టంగా బ్యాటింగ్ వైఫల్యాలే. కేకేఆర్‌తో మ్యాచ్ లో సెంచరీ చేసిన  బ్రూక్.. ముంబైతో మళ్లీ  విఫలమయ్యాడు. అతడు నిలిచి రాహుల్ త్రిపాఠి గానీ  నిలకడగా ఆడుతున్న మార్క్‌రమ్ గానీ బ్రూక్‌కు అండగా ఉంటే హైదరాబాద్‌కు తిరుగుండదు. అంతగా అనుభవం లేని చెన్నై బౌలింగ్  ను ఎదుర్కోవడం  వీరికి పెద్ద కష్టమేమీ కాదు. 


అలా అయితే మరో స్పిన్నర్..!


బౌలింగ్‌లో కూడా  నట్టూ (నటరాజన్) ధారాళంగా పరుగులిస్తుండటం సన్ రైజర్స్ ను ఆందోళనకు గురిచేసేదే. భువీ  ఫర్వాలేదనిపిస్తున్నాడు. మయాంక్ మార్కండే తన స్పిన్ తో మ్యాజిక్ చేస్తే చెన్నైకి కష్టమే. చెపాక్ లో చెన్నైతో ముగిసిన గత మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్  పిచ్ స్వభావాన్ని గమనించి చాహల్, అశ్విన్ లతో పాటు జంపాను కూడా వాడుకుంది.  ఈ ముగ్గురూ చెన్నైని కట్టడి చేశారు.ఇదే ఫార్ములాను ఫాలో అయితే  సన్ రైజర్స్ కూడా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చు.  స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నైని వీళ్లు ఎలా నిలువరిస్తారన్నది కీలకం.  


 






సొంతగడ్డపై చెన్నై మరింత బలంగా.. 


చెపాక్ స్టేడియంలో వందలాది మ్యాచ్ లు ఆడిన ధోని సేన.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే,  రహానే, శివమ్ దూబే, రాయుడు, రవీంద్ర జడేజా, ధోని వంటి  బ్యాటర్లతో పటిష్టంగా ఉంది.  లక్నోతో మ్యాచ్ లో ఆ జట్టు ఇక్కడ 200 ప్లస్ స్కోరు చేయగా రాజస్తాన్‌తో కూడా  175 పరుగుల టార్గెట్ లో  విజయానికి దగ్గరగా వచ్చింది. ఇక  ఆర్సీబీతో ఆడిన గత మ్యాచ్ లో రహానే, కాన్వే, దూబేలు దుమ్ము దులిపారు.   సొంత అభిమానుల మధ్యలో ఆడుతుండటం వీరికి మరింత కలిసొచ్చేదే. 


అయితే బ్యాటింగ్ పటిష్టంగా ఉన్న బౌలర్లలో అనుభవరాహిత్యం  చెన్నైని దెబ్బతీసేదే.   ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, పతిరన లు ఇంకా   కుదురుకోలేదు. సీనియర్ స్పిన్నర్లు మోయిన్ అలీ, రవీంద్ర జడేజాతో పాటు యువ స్పిన్నర్ తీక్షణ మీదే ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. 


రికార్డులు వాళ్ల వైపే.. 


ఐపీఎల్ లో ఇప్పటివరకు చెన్నై - హైదరాబాద్ మధ్య  19 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో  ధోని సేనదే ఫుల్ డామినేషన్.  సీఎస్కే ఏకంగా 14 మ్యాచ్ లలో విజయాలు సాధించగా సన్ రైజర్స్ గెలిచింది ఐదు మాత్రమే.  చెపాక్ లో  ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరుగగా మూడింట్లోనూ  సీఎస్కేదే విజయం. ఇక ఈ రెండు జట్లూ తలపడిన గత  ఐదు మ్యాచ్‌లలో  చెన్నై 3 నెగ్గగా హైదరాబాద్ రెండు గెలిచింది. 


 






పిచ్ రిపోర్టు :


చెన్నై చెపాక్  పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది.  కానీ మ్యాచ్ జరుగుతున్నకొద్దీ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు మెండుగా ఉంటాయి.  ఛేదన చేసే జట్లకు కాస్త కష్టమేనని ఈ సీజన్ లో ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ ల ఫలితాలే చెబుతున్నాయి. 


తుది జట్లు (అంచనా) : 


సన్ రైజర్స్  హైదరాబాద్ : హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, అదిల్ రషీద్,  భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, మయాంక్ మార్కండే 


ఇంపాక్ట్ ప్లేయర్లు : అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, అన్‌మోల్ ప్రీత్ సింగ్ 


చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, మోయిన్ అలీ,  రవీంద్ర జడేజా, ధోని (కెప్టెన్), తుషార్ దేశ్‌పాండే,  మహీశ్ తీక్షణ, మతీష పతిరన, ఆకాశ్ సింగ్ 


ఇంపాక్ట్ ప్లేయర్లు :  మిచెల్ సాంట్నర్, రాజ్యవర్ధన్ హంగర్గేకర్, బెన్ స్టోక్స్