IPL 2023: ఐపీఎల్  ప్రారంభానికి రెండ్రోజులు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ షాకిచ్చాడు.  ఈ సీజన్‌కు ముందు గతేడాది డిసెంబర్ లో కొచ్చి వేదికగా ముగిసిన  ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై.. రూ. 16.25 కోట్లు వెచ్చించి ఇంగ్లాండ్ టెస్టు సారథి  బెన్ స్టోక్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  షేన్ వాట్సన్ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్న  సీఎస్కే..  స్టోక్స్‌ను దక్కించుకుంది.   ఈ సీజన్ లో అతడు  ఆల్ రౌండర్ గా సేవలందిస్తాడని భావించింది.   కానీ స్టోక్స్ మాత్రం సీజన్ కు ముందే చెన్నైకి షాకులిచ్చేలా ఉన్నాడు.


బ్యాటింగ్‌కే పరిమితం.. 


ఐపీఎల్ సీజన్  కంటే ముందే  ఇంగ్లాండ్ టెస్టు జట్టు న్యూజిలాండ్ కు వెళ్లి రెండు టెస్టులు ఆడింది.   చాలాకాలంగా ఎడమ  మోకాలి గాయంతో  ఇబ్బందులు పడుతున్న  స్టోక్స్.. ఈ సిరీస్ లో 9 ఓవర్లు మాత్రమే  బౌలింగ్ చేశాడు.  ఇక రాబోయే సీజన్ లో  కూడా అతడు బ్యాటింగ్ కే పరిమితం కానున్నాడని.. కొంచెం కుదురుకునేదాకా (?)  బౌలింగ్ చేయడని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపాడు.  బహుశా  ఈ సీజన్ లో తొలి అర్థభాగం  స్టోక్స్.. సీఎస్కేకు  బ్యాటర్ గానే సేవలందిస్తాడు.   ఆ తర్వాత  కూడా అన్నీ  కుదిరితేనే బౌలింగ్ వేసే అవకాశాలున్నాయి. 


ఇంజక్షన్ వేసుకుని... 


ఈ సీజన్  కోసం రావడానికి ముందే   స్టోక్స్.. మోకాలి గాయం తిరగబెట్టకుండా  cortisone ఇంజెక్షన్ వేసుకుని వచ్చాడట.  ఇది  వాపును తగ్గించే సాధారణ యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ  ఇంజెక్షన్.  స్టోక్స్ ఫిట్నెస్ గురించి  హస్సీ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసినంతవరకైతే  ఈ సీజన్ లో స్టోక్స్  ఫస్టాప్ వరకూ  బ్యాటర్ గానే సేవలందిస్తాడు.  బౌలింగ్ విషయంలో మేం  మరికొన్నిరోజులు వేచి చూడాల్సి ఉంది.   సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో అతడు చిన్నగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.  చెన్నై ఫిజియోలు, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)   వైద్య బృందం  స్టోక్స్   గాయం, ఫిట్నెస్ పై ఓ కన్నేసి ఉంచింది. ప్రస్తుతానికైతే  స్టోక్స్  బ్యాటర్ గానే కొనసాగుతాడు.   ఆ తర్వాతే అతడి బౌలింగ్ గురించి ఆలోచిస్తాం..’అని చెప్పాడు. 


కాగా  ఐపీఎల్-16లో   చెన్నై సూపర్ కింగ్స్.. తమ తొలి పోరును  ఈనెల 31న  గుజరాత్ టైటాన్స్ తో జరుగబోయే మ్యాచ్ తో ప్రారంభించనుంది. గతేడాది అత్యంత పేలవమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన   చెన్నై.. ఈసారి మాత్రం పట్టు వదలకూడదని  మళ్లీ విజేతలుగా నిలవాలనే పట్టుదలతో ఉంది. ధోనికి చివరి సీజన్ అని  గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో  ఈసారి ఆ జట్టు తిరిగి పుంజుకోవడమే గాక  కప్ కొట్టి  మహేంద్రుడికి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే  సుమారు నెలన్నర నుంచే ఆ జట్టు సాధన సాగుతోంది. మరి ధోని సారథ్యంలోని చెన్నైచిన్నోళ్లు ఏం మ్యాజిక్ చేస్తారో  చూడాలి.