Indore Stadium Pitch Rating:


ఐసీసీ ఇండోర్‌ పిచ్‌ రేటింగ్‌ను సవరించింది. 'పూర్‌' నుంచి 'బిలో యావరేజ్‌'కు మార్చింది. భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఈ పిచ్‌పై అనూహ్యమైన టర్నేమీ లేదని వెల్లడించింది. బీసీసీఐ ఫిర్యాదు చేయడంతో మ్యాచ్‌ ఫుటేజీని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.


బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టును ఇండోర్‌లో నిర్వహించారు. ఈ మ్యాచ్‌ కేవలం ఏడు సెషన్లే జరిగింది. రెండు జట్ల స్పిన్నర్లు దుమ్మురేపడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మొత్తానికి ఆస్ట్రేలియా విజయం అందుకొని టీమ్‌ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. అయితే మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ఈ పిచ్‌కు 'పూర్‌' రేటింగ్‌ ఇచ్చాడు. మూడు డీమెరిట్‌ పాయింట్లు ప్రకటించాడు. ఇప్పుడు దానిని ఐసీసీ ఒక డీమెరిట్‌ పాయింట్‌కు తగ్గించింది.


'భారత్‌, ఆసీస్‌ మూడో టెస్టు మ్యాచ్‌ ఫుటేజీని పరిశీలించాం. ఐసీసీ క్రికెట్‌ జీఎం వసీమ్‌ ఖాన్‌, ఐసీసీ క్రికెట్‌ కమిటీ సభ్యుడు రోజర్‌ హార్పర్‌తో కూడిన బృందం మ్యాచ్‌ రిఫరీ నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్టు భావించింది. అయితే పూర్‌ రేటింగ్‌ ఇచ్చేంత ప్రమాదకరమైన బౌన్స్‌ లేదు. దాంతో అప్పీల్‌ ప్యానెల్‌ రేటింగ్‌ను బిలో యావరేజికి మార్చింది' అని ఐసీసీ మీడియాకు వెల్లడించింది.


అంతకు ముందు క్రిస్‌ బ్రాడ్‌ 'పిచ్‌ చాలా మందకొడిగా ఉంది. బ్యాటు, బంతికి సమతూకంగా లేదు. మొదటి నుంచే స్పిన్నర్లకు అనుకూలించింది. ఐదో బంతికే బంతి పిచ్‌పై పగుళ్లకు కారణమైంది. చాలాసార్లు అలాగే చేసింది. సీమ్‌కు అస్సలు అనూలించలేదు. మ్యాచ్‌ సాంతం అనూహ్యమైన బౌన్స్‌ కనిపించింది' అని నివేదిక ఇచ్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు అంతకన్నా ఎక్కువ డీమెరిట్‌ పాయింట్లు వస్తే ఆ పిచ్‌ను 12 నెలల పాటు నిషేధిస్తారు.


ఇండోర్‌ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే?


నెర్రెలు వాసిన పిచ్‌! బంతిని గింగిరాలు తిప్పించే స్పిన్నర్లు! మైండ్‌ గేమ్‌ ఆడితే గెలవచ్చేమో అనే ఆశలు! ఇండోర్‌ టెస్టు మూడో రోజు ఆట మొదలయ్యేముందు టీమ్‌ఇండియా సిచ్యువేషన్‌ ఇదీ! కానీ అద్భుతమేమీ జరగలేదు. అసాధ్యం సుసాధ్యం అవ్వలేదు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయాసంగా ఛేదించేసింది. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించేసింది. ఆఖరి టెస్టుకు కొండంత ఆత్మవిశ్వాసం సాధించేసింది. ట్రావిస్‌ హెడ్‌ (49; 53 బంతుల్లో 6x4, 1x6), మార్నస్‌ లబుషేన్‌ (28; 58 బంతుల్లో 6x4) ఎలాంటి 'కంగారూ' లేకుండా ఆసీస్‌ను గెలిపించేశారు.


వికెట్లు పడలేదు!


మూడో రోజు, శుక్రవారం ఆసీస్‌ తాజాగా ఛేదనకు దిగింది. పరుగుల ఖాతా తెరవక ముందే ఉస్మాన్‌ ఖవాజా (0)ను అశ్విన్‌ ఔట్‌ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లను పదేపదే ఇబ్బంది పెట్టాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్‌ లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్‌ కుదురుగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్లను ఆచితూచి ఎదుర్కొన్నాడు. పది ఓవర్ల తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచారు. దొరికిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించి ఆత్మవిశ్వాసం సాధించారు. ఆపై నిర్భయంగా షాట్లు ఆడేసి 18.5 ఓవర్లకు ఆసీస్‌కు 9 వికెట్ల తేడాతో విజయం అందించారు. మరో 3 వికెట్లు పడుంటే ఆట రసవత్తరంగా ఉండేది.


ఇన్నింగ్స్‌ వివరాలు


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ - 109 ఆలౌట్‌
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ - 197 ఆలౌట్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ - 163 ఆలౌట్‌
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ - 78/1తో విజయం