BCCI Annual Contracts for Senior Women: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈరోజు (ఏప్రిల్ 27వ తేదీ) 2022-23 సీజన్ కోసం మహిళా క్రికెటర్ల కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఇందులో 17 మంది ప్లేయర్లకు చోటు దక్కింది. ఈ 17 మందిని మూడు వేర్వేరు గ్రేడ్‌లలో ఉంచారు. ప్రతి గ్రేడ్ వార్షిక వేతనం భిన్నంగా ఉంటుంది.
సరిగ్గా నెల రోజుల క్రితం పురుషుల కోసం కూడా కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఆ జాబితాలో 26 మంది ఆటగాళ్లను నాలుగు గ్రేడ్‌లలో ఉంచారు. పురుష, మహిళా క్రికెటర్ల ఈ గ్రేడ్‌ల మధ్య వేతనంలో భారీ వ్యత్యాసం ఉంది. రెండు కాంట్రాక్టు జాబితాలలో టాప్ గ్రేడ్‌ను మాత్రమే పోల్చినట్లయితే, ఏకంగా 14 రెట్లు తేడా ఉంటుంది.
టాప్ గ్రేడ్‌లో 6.50 కోట్ల వ్యత్యాసం
మహిళా క్రికెటర్ల 'గ్రేడ్ ఏ'లో చేరిన ప్లేయర్లకు బీసీసీఐ ఏటా రూ. 50 లక్షలు చెల్లిస్తుంది. మరోవైపు పురుష క్రికెటర్ల 'గ్రేడ్ A+'లో ఉన్న ఆటగాళ్ల వార్షిక వేతనం రూ. 7 కోట్లుగా ఉంది.
రెండో గ్రేడ్‌లో 16 రెట్ల కంటే ఎక్కువ గ్యాప్
మహిళా క్రికెటర్ల 'గ్రేడ్ బి' క్రీడాకారిణుల వార్షిక వేతనం రూ. 30 లక్షలు. అదే సమయంలో పురుష క్రికెటర్ల సెకండ్ గ్రేడ్‌లో అంటే 'గ్రేడ్ A'లో ప్రతి క్రీడాకారుడికి ఏటా రూ. 5 కోట్లు ఇస్తారు. అంటే ఇక్కడ 16 రెట్ల కంటే ఎక్కువ దూరం ఉంది.
మూడో గ్రేడ్‌లో తేడా ఏకంగా 30 రెట్లు
మహిళా క్రికెటర్ల 'గ్రేడ్ సి'లో ఉన్న క్రీడాకారిణుల వార్షిక వేతనం కేవలం రూ.10 లక్షలుగా ఉంది. మరోవైపు పురుషులు మూడో గ్రేడ్‌లో అంటే 'గ్రేడ్ B'లో రూ. 3 కోట్లు పొందుతారు. అంటే ఇక్కడ ఇద్దరి వేతనంలో 30 రెట్లు తేడా ఉంది. పురుష క్రికెటర్లలో నాలుగో గ్రేడ్ కూడా ఉంది. 'గ్రేడ్ సి'లో చేర్చబడిన క్రికెటర్లు సంవత్సరానికి రూ. కోటి వార్షిక వేతనం పొందుతారు. అయితే మహిళా క్రికెటర్లలో నాలుగో గ్రేడ్ ఉంచలేదు.