Sachin Tendulkar: భారత మాజీ కెప్టెన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజాగా తనను అబ్బుర పరిచిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అచ్చు జహీర్ ఖాన్ బౌలింగ్ యాక్షన్ తో బౌలింగ్ చేస్తున్న ఒక చిన్నారి బాలిన వీడియోను షేర్ చేసిన సచిన్.. తన బౌలింగ్ యాక్షన్ అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. చాలా స్మూత్ గా, ఎఫెక్టివ్ బౌలింగ్ యాక్షన్ అని కొనియాడాడు. దీన్ని చూడమని జహీర్ ఖాన్ ను ట్యాగ్ చేశాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలైంది. అభిమానులు సుశీలా మీనా అనే పేరు గల ఆ బాలిక వీడియోను షేర్ చేస్తూ ఆనంద పడుతున్నారు. అచ్చు జహీర్ లాగే బౌలింగ్ చేస్తోందని ప్రశంసిస్తున్నారు.
దిగ్గజ క్రికెటర్లు..
ఇక భారత క్రికెట్ కు సచిన్, జహీర్ ఎంతో సేవ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో చాలా వరకు రికార్డులు తన పేరిటే ఉన్నాయి. కొన్ని రికార్డులు అయితే ఎప్పటికీ చెక్కు చెదరవు అనే విధంగా ఉన్నాయి. అత్యధిక వన్డేలు, అత్యధిక టెస్టులు, అత్యధిక అంతర్జాతీయ పరుగులు, అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు ఇలా బోలెడు రికార్డులు సచిన్ పేరిట ఉన్న సంగతి తెలిసిందే. ఇక జహీర్ మిలీనియంలో అరంగేట్రం చేసి అనతి కాలంలోనే జట్టుకు ప్రధాన బౌలర్ గా మారాడు. లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ తో ఎన్నో మ్యాచ్ ల్లో భారత్ కు విజయాలు అందించాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ (2011) ను సాధించడంతో కీలక భూమిక పోషించారు.
బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎన్నికకు రంగం సిద్ధం..
ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు తీసుకోవడంతో బీసీసీఐ కార్యదర్శి పోస్టు ఖాలీ అయింది. అయితే ఈ పోస్టుకు సంబంధించి ఎన్నికను వచ్చేనెల 12 న ముంబైలో నిర్వహించనున్నట్లు బోర్డు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. మహారాష్ట్ర మంత్రిగా ఆశిష్ సెలార్ బాధ్యతలు చేపట్టడంతో ఖాళీ అయిన బోర్డు కోశాధికారి పదవిని కూడా అప్పుడే ఎన్నుకుంటారని తెలుస్తోంది. బోర్డు పదవులు ఖాళీ అయితే 45 రోజుల్లోపు ఎన్నిక నిర్వహించాలని బీసీసీఐ రాజ్యాంగం చెబుతోంది. ప్రస్తుతం తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న దేవజిత్ సైకియా.. కార్యదర్శిగా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అతనికి గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్ తో గట్టి పోటీ ఎదురు కానుంది. ఈ ఎన్నికకు మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ అనిల్ కుమార్ జ్యోతిని నియమించారు.