T20 World Cup 2022: విరాట్ కోహ్లీని క్రికెట్ మైదానంలో 'చేజ్ మాస్టర్' అని పిలుస్తారు. చాలా సార్లు దీన్ని రుజువు చేశాడు కోహ్లీ. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి చేజింగ్ స్టార్‌ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి టీమ్ ఇండియాను గెలిపించాడు. పాకిస్తాన్‌పై తాను ఆడిన  ఇన్నింగ్స్‌ను అత్యుత్తమమైనదిగా విరాట్ కోహ్లీ అభివర్ణించాడు. దీనికి ముందు 2016 టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ను అత్యుత్తమమైనదిగా భావించాడు.


పాకిస్థాన్‌పై కోహ్లీ 308 సగటు


టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు 300 దాటింది. వాస్తవానికి టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ రికార్డు గురించి మాట్లాడితే.. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 5సార్లు ఆడాడు. కానీ పాకిస్తాన్ బౌలర్లు ఈ భారత మాజీ కెప్టెన్‌ను ఒక్కసారి మాత్రమే అవుట్ చేయగలిగారు. గత ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో విరాట్ కోహ్లీని షాహీన్ అఫ్రిది ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. విరాట్ కోహ్లీ 2012 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ పై 78 పరుగులు చేశాడు. 2014, 2016లో వరుసగా 36, 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 


టీ20 వరల్డ్‌కప్‌ 2021లో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడినప్పుడు విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్‌లో 57 పరుగులు చేశాడు.  టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేశాడు. ఈ సమయంలో భారత మాజీ కెప్టెన్ సగటు 308గా ఉంది. స్ట్రైక్ రేట్ 132.75గా ఉండగా.. అయితే పాకిస్తాన్‌పై కోహ్లీ బ్యాటింగ్ సగటు పరంగా చూస్తే డాన్ బ్రాడ్ మాన్‌ను మించిపోయాడు కోహ్లీ. టీ20 వరల్డ్‌కప్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ సగటు 270.50గా ఉంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 22 ఇన్నింగ్స్ ల్లో మొత్తం 541 పరుగులు చేశాడు.


ఓటమి అంచుల వరకు వెళ్లిన మ్యాచ్ ను టీమిండియా మాజీ కెప్టెన్, ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6x4, 4x6) తన అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 తొలి సూపర్‌ 12 మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. దాంతో ఈ మ్యాచ్ పై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ తో చెలరేగుతున్నారు. 


ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51; 34 బంతుల్లో 2x4, 4x6), షాన్‌ మసూద్‌ (52*; 42 బంతుల్లో 5x4, 0x6) హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ 159/8కి పరిమితమైంది. తడబడుతూ ఛేజింగ్ చేసిన భారత్ 10 ఓవర్లకు 45-4 గా ఉంది. కానీ హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ మ్యాచ్ ను 15 ఓవర్లకు 100-4కు తీసుకెళ్లారు. చివరి 6 బంతుల్లో టీమ్‌ఇండియాకు విజయానికి 16 రన్స్‌ కావాలి. పాండ్యా ఔటైనా, విరాట్ కోహ్లీ నోబాల్ ను సిక్సర్ గా మలవడం, ఫ్రీహిట్‌ బంతికి 3 పరుగులు తీశారు. చివరి బంతికి సింగిల్ తీసి భారత్ అపూర్వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ మాజీ క్రికెటర్లతో పాటు తోటి ఆటగాళ్లు విరాట్ బ్యాటింగ్ ను ప్రశంసించారు.


ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి ముగింపు వరకు టీమ్‌ఇండియా క్రికెటర్లు, అభిమానులు ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. జయహే.. జయహే అంటున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. భారత్‌ 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు హిట్‌మ్యాన్‌ కుర్రాడు. అప్పట్నుంచి చాలా ప్రపంచకప్‌లు ఆడాడు. ఈ సారి కెప్టెన్సీ చేస్తున్నాడు. అతడి వయసు ఇప్పుడు 35. మహా అయితే రెండేళ్లు ఆడగలడు. అందుకే తన నాయకత్వంలో ప్రపంచకప్‌ గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు.


విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య నాయకత్వ విభేదాలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌ అవుతుంటాయి. ఇద్దరి అభిమానులు పరస్పరం వాదోపవాదాలకు దిగుతుంటారు. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లీ, రోహిత్‌ మధ్య బ్రొమాన్స్‌ చూస్తే అలా అనిపించదు. విజయం అందించిన వెంటనే హిట్‌మ్యాన్‌ పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చాడు. విరాట్‌ను ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. బిగ్గరగా హత్తుకున్నాడు. ఈ సీన్‌ చూస్తున్న కోట్లాది మంది థ్రిల్‌ అయ్యారు.