Shikhar Dhawan:  నవంబర్ 25 నుంచి టీమిండియా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు భారత జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. గతేడాది జూన్ లో శ్రీలంక టూర్ కు వెళ్లినప్పుడు టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుకు తొలిసారిగా ధావన్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అలానే ఈ నెలలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం మయాంక అగర్వాల్ స్థానంలో తమ జట్టుకు శిఖర్ ధావన్ ను సారిథిగా నియమించింది. 


ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు కెప్టెన్ గా ధావన్ జట్టును ఎలా నడిపించనున్నాడు? భారత జట్టు నాయకుడిగా తన బలాబలాలేంటి? నాయకత్వ భారం తన బ్యాటింగ్ పై పడకుండా ఎలా చూసుకుంటాడు? ఇలాంటి పలు ప్రశ్నలకు ధావన్ సమాధానం ఇచ్చాడు. 


పంజాబ్ కింగ్స్  కెప్టెన్సీ గురించి


'గతేడాది మేము అనుకున్నట్లుగా పంజాబ్ కింగ్స్ ప్రయాణం సాగలేదు. ఆ సీజన్ లో మేం బాగా ఆడలేకపోయాం. అయితే ఈసారి మా నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. గతేడాది కాగితం మీద పంజాబ్ కింగ్స్ జట్టు బలంగా ఉంది. అయితే ఈసారి కాగితంపైనా, మైదానంలోనూ బలంగా ఉన్నాం. గతంలోని తప్పులను విశ్లేషించుకుని బలంగా తిరిగి రావాల్సిన అవసరముంది. అంతేకానీ గతాన్ని మోసుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు. ఒక కెప్టెన్ గా నేను ఆటగాళ్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలి. ఒత్తిడిని దరిచేరనీయకూడదు. ప్లేయర్స్ కు స్వేచ్ఛనిస్తే ఫలితాలు బాగుంటాయి. అలానే సాధన, శ్రమ, బాగా ఆడడం అనేది మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించకూడదు. కాబట్టి ఈసారి మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. అలాగే ఇప్పటివరకు ఐపీఎల్ లో నేను ఉన్న ప్రతి జట్టు ఒక్కసారైనా ఫైనల్ కు చేరుకుంది. కాబట్టి ఈసారి పంజాబ్ కిింగ్స్ కూడా ఫైనల్ కు చేరి కప్పు అందుకుంటుందని, దానికి తగిన కృషి మేం చేయాలనుకుంటున్నామని' ధావన్ స్పష్టంచేశాడు. 


భారత జట్టుకు నాయకత్వం వహించడం గురించి


'ఒక జట్టుకు కెప్టెన్ అన్నాక చాలా బాధ్యతలు ఉంటాయి. మీ గురించే కాక జట్టు మొత్తం గురించి ఆలోచించాలి. ఎన్నో విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తిని. ఎలాంటి అనవసరమైన ఆలోచనలు చేయను. ఎప్పుడూ జట్టుతో కలిసిపోతాను. అది నా స్వభావం. ఇది కెప్టెన్ గా నాకు ప్రయోజనం అవుతుంది.  మైదానంలో నా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, నా ప్రశాంతత, నిర్ణయాలు తీసుకోవడంలో పరిణతి అనేవి నా బలాలు. ఆటగాళ్లపై ఒత్తిడి పడుకుండా చూసుకోగలగాలి.' అని అన్నాడు. 


'అలాగే నేను చాలా క్రికెట్ ఆడాను. దాని ద్వారా అనుభవం సంపాదించాను. మైదానంలో ఎలా ఉండాలి. ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి నాకు తెలుసు. ఎక్కువగా ఆడుతున్నప్పుడు మనపై మనకు నమ్మకముంటుంది. నిర్ణయాల్లో పరిణతి వస్తుంది. కొన్నిసార్లు మ్యాచులో పొరపాట్లు జరగవచ్చు. వాటిని ఎలా అధిగమించాలి. సహచరులను ఎలా ఉత్సాహంగా ఉండేలా చూసుకోవాలో అనుభవం ద్వారా నేర్చుకున్నాను. నేను ఎప్పుడూ కెప్టెన్సీ గురించి కలలు కనేవాడిని. ఇప్పుడు ఇది నాకు దక్కింది. నా సారథ్యంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలపై సిరీస్ విజయాలు గెలిచాను. అలానే కివీస్ లోనూ బాగా ఆడి సిరీస్ గెలవగలమనే నమ్మకం నాకుంది. ఆ దిశగా మేం ప్రయత్నిస్తాం' అని ధావన్ చెప్పాడు.