Gautam Gambhir News: ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత స్క్వాడ్ లో కీలకమార్పు జరిగినట్లు తెలుస్తోంది. గతనెలలో 18 మందితో కూడిన భారత బృందాన్ని ఇంగ్లాండ్ టూర్ కు ఎంపిక చేయగా, తాజాగా మరో పేసర్ ను ఈ స్క్వాడ్ కు యాడ్ చేసినట్లు సమాచారం. అతను మరెవరో కాదు హర్షిత్ రాణా. ఇంగ్లాండ్ లోనే ఉన్న హర్షిత్ రాణా అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో వికెట్ తీసి 99 పరుగులిచ్చాడు. బ్యాటింగ్ లో కూడా ఒక చేయి వేశాడు. అయితే ఇప్పటికే జట్టులో ఐదుగురు పేసర్లు ఉండటంతో ఆరో పేసర్ రాణాను తీసుకోవడం చర్చనీయాంశం అయింది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ లను గతనెలలో ఇంగ్లాండ్ టూర్ కోసం భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఐదు టెస్టుల సిరీస్ లో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే బుమ్రా ఆడతాడని సమాచారం. అయినప్పటికీ, నలుగురు పేసర్లకు తోడు రాణాను తాజాగా ఎంపిక చేయడం ఆసక్తికరంగా ఉంది.
గతేడాది అరంగేట్రం..గతేడాది బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా హర్షిత్ రాణా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే రెండు టెస్టులాడిన అతను నాలుగు వికెట్లతో ఉసూరుమనిపించాడు. దీంతో మళ్లీ టెస్టుల్లోకి తనను ఎంపిక చేయలేదు. ఇక వైట్ బాల్ క్రికట్లో మాత్రం అరంగేట్రం చేసి, ఫర్వాలేదనిపించాడు. ఇప్పటికే 18 మంది భారత సభ్యులు ఉండగా, ఎవరూ గాయపడకుండానే రాణాను 19వ ప్లేయర్ గా ఎంపిక చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై పలు విమర్శలు వస్తున్నాయి.
ఫేవరిటిజంతోనేనా..?గతేడాది ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్ గా వ్యవహరించి, ఆ జట్టు కప్పు సాధించడంతో గంభీర్ పేరు మార్మోగిపోయింది. అదే జోరులో తను ఏకంగా టీమిండియాకు హెడ్ కోచ్ గా కూడా వచ్చాడు. అయితే కేకేఆర్ ఆటగాళ్లపై గంభీర్ పక్షపాతం చూపిస్తున్నట్లు పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హర్షిత్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, అతి త్వరలోనే అన్ని ఫార్మాట్లలో తనను అరంగేట్రం చేపించడం గంభీర్ ఫేవరిజటాన్ని చూపిస్తోందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్లో సాధారణ ప్రదర్శన చేసే హర్షిత్ కు ఇంత ప్రాధాన్యం ఇవ్వడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు రాణా ఎంపికపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ, ఒకవేళ ఎంపిక చేస్తే, ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చిందనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ వివరణ ఇవ్వాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.