Ind Vs Aus Test Series: ఆస్ట్రేలియా పర్యటనలో భారత బ్యాటర్లు పరుగుల కోసం తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మూడు టెస్టులు జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే నాలుగు వందలకు పైచిలుకు పరుగులు నమోదైంది. అది కూడా పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో ఈ ఘనత సాధ్యమైంది. ఆ తర్వాత మిగతా ఐదు ఇన్నింగ్స్ లలో కనీసం ఒక్కసారి కూడా 300 పరుగుల మార్కును చేరుకోలేదు. పెర్త్ తొలి ఇన్నింగ్స్ లో 140 పరుగులు చేయగా, ఇక అడిలైడ్ లో వరుసగా 180, 175 పరుగులు చేసింది. ఇక బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టులో టెయిలెండర్ల చలవతో అటు ఫాలో ఆన్ ని, ఇటు 250 పరుగుల మార్కును దాటింది. అయితే జట్టులో టాపార్డర్ పరుగులు చేయాలని స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చెప్పుకొచ్చాడు. అప్పుడు మాత్రమే మిగతా బ్యాటర్లపై ఒత్తిడి ఉండబోదని పేర్కొన్నాడు. 


మిడిలార్డర్ పై ఒత్తిడి..
నిజానికి టాపార్డర్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్థిరంగా రాణిస్తున్నప్పటికీ, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి టెస్టు తరువాత విఫలమవుతున్నాడు. పెర్త్ రెండో ఇన్నింగ్స్ లో చేసిన భారీ సెంచరీ మినహా తన బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు రాలేదు. పైగా, ఆసీస్ పేసర్ మిషెల్ స్టార్క్ ను స్లెడ్జ్ చేసి అతనికే మూడుసార్లు వికెట్లు సమర్పించుకున్నాడు. ఇక వన్ డౌన్ లో శుభమాన్ గిల్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. తనకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. బ్రిస్బేన్ లో అనవసర షాట్లు కొట్టి ఔటవుతున్నాడు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రోహిత్ శర్మ కూడా స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంది. జడేజా కూడా టాప్ లోని ముగ్గురు నిలకడగా రాణిస్తేనే తర్వాతి బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు వీలుంటుందని పేర్కొన్నాడు. బాధ్యతాయుతంగా ఆడితేనే కఠినమైన ఆసీస్ గడ్డపై సత్తా చాటగలమని పేర్కొంటున్నాడు. 


Also Read: Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు


చెమటోడ్చిన బౌలర్లు..
ఈనెల 26 నుంచి మొదలయ్యే బాక్సింగ్ డే టెస్టు కోసం భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. మెల్బోర్న్ స్టేడియంలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కఠోర శ్రమ చేస్తూ కనిపించారు. ఈ సిరీస్ లో బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా.. ఆసీస్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు. 21 వికెట్లతోలీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.



సిరాజ్ 13 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మెల్ బోర్న్ టెస్టులో భారత్ తుదిజట్టులో మార్పులు చేసే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టెస్టును భారత్ నెగ్గగా, ఆసీస్ రెండో టెస్టును తన ఖాతాలో వేసుకుంది. ఎడతెగని వర్షం వల్ల మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 


Also Read: Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు