Cricket News: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం వడొదర వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను దీప్తీ శర్మ (6/31, 39 పరుగులు నాటౌట్) ఆల్ రౌండ్ ప్రదర్శనతో బెంబేలెత్తించింది. తొలుత గింగరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థి పని పట్టిన దీప్తి.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చింది. దీప్తి ధాటికి విండీస్ 38.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. జట్టులో చినెల్ హెన్రీ (61) అర్థ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. క్యాంబెల్ (46) సత్తా చాటగా, ఆలియా అలెన్ (21) ఫర్వాలేదనిపించింది. దీప్తితో పాటు రేణుకా ఠాకూర్ (4/29) రెచ్చి పోవడంతో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. ప్రత్యర్తి జట్టు మొత్తాన్ని వీరిద్దరే ఆలౌట్ చేయడం విశేషం. ఆరంభంలో ప్రమాదకర హేలీ మాథ్యూస్ , క్వినా జోసెఫ్ లను డకౌట్ చేసి రేణుక.. విండీస్ కు షాకిచ్చింది. ఆ తర్వాత దీప్తితో కలిసి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ప్రత్యర్థి కోలుకోలేక పోయింది. ఆ తర్వాత భారత్ 28.2 ఓవర్లలోనే ఐదు వికెట్లకు 167 పరుగులు చేసి విజయం సాధించింది.
స్మృతి మంధాన విఫలం..
వరుసగా ఆరు మ్యాచ్ ల్లో అర్థ సెంచరీలు సాధించి రికార్డు నెలకొల్పిన భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నాలుగు పరుగులు చేసి విఫలమైంది. మరో బ్యాటర్ హర్లీన్ డియోల్ కూడా త్వరగానే వెనుదిరిగడంతో ఛేదనలో 23/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 32, 7 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (29) ఆదుకున్నారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ముఖ్యంగా హర్మన్ ప్రీత్ కౌర్ బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపారు.
రెండు సిక్సర్లలో మ్యాచ్ ఫినిష్..
అయితే వీరిద్దరూ ఔటన తర్వాత దీప్తి (48 బంతుల్లో 39 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్ )తో అజేయ ఇన్నింగ్స్ తో సత్తా చాటింది. చివర్లో రిచా ఘోష్ (11 బంతుల్లో 23 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) ధనాధన్ ఆటతీరుతో మ్యాచ్ ను త్వరగా ముగించింది. దీప్తి, రిచాలు అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. మ్యాచ్ చివర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన రిచా.. మ్యాచ్ ను తన దైన శైల్లో ముగించింది. ప్రత్యర్థి బౌలర్లలో దియోంద్ర డాటిన్, అలియా, మాథ్యూస్, ప్లెచర్; కరిష్మాలకు తలో వికెట్ దక్కింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లో పది వికెట్లు తీసిన రేణుక ఠాకూర్ కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
Also Read: Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం