భారత మహిళల జట్టు రెండేళ్ల విరామం తర్వాత టెస్ట్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అదృష్టం పరీక్షించుకోనుంది. టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఇంగ్లాండ్‌తో ఆడిన 14 టెస్టుల్లో భారత్ ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. స్పిన్నే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగుతోన్న భారత జట్టు... బ్రిటీష్ జట్టును స్పిన్ వలలో చుట్టేయాలని చూస్తోంది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్ టెస్టులో ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది చూడాలి. వీరితో పాటు దీప్తి శర్మ కూడా స్పిన్‌తో రాణించగలదు.
హర్మన్‌ప్రీత్ కౌర్ తొలిసారి ఓ టెస్టు మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించనుంది. భారత మహిళల జట్టు చివరిసారి 2021 సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ డ్రా అయింది. ఇంగ్లాండ్ మహిళలకు ఇది 100వ టెస్టు మ్యాచ్. భారత్ ఇప్పటి వరకు 38 టెస్టులు మాత్రమే ఆడింది. 2014 తర్వాత భారత్‌లో మహిళల టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. మిథాలీరాజ్, జులన్ గోస్వామిల రిటైర్మెంట్ తర్వాత జట్టు ఆడుతున్న మొదటి టెస్టు ఇదే. ఈ నేపథ్యంలో టెస్టు అనుభవంపై ఇంగ్లండ్ ఆధారపడుతుండగా... సొంతగడ్డపై ఆడుతున్న అనుకూలతను హర్మన్ సేన నమ్ముకుంది.
భారత బ్యాటింగ్ లైనప్‌లో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ కీలకం కానున్నారు. , రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా, దీప్తి శర్మలతో బౌలింగ్ దళంగా కూడా పటిష్టంగానే ఉన్నది. మరోవైపు, టీ20 సిరీస్ విజయంతో ఇంగ్లాండ్ మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అలాగే, భారత జట్టుతో పోలిస్తే ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడటం కూడా వారికి కలిసిరానుంది. ఇంగ్లాండ్ జట్టులో బ్యూమాంట్, హీథర్ నైట్, నాట్ స్కివర్ బ్రంట్, అమీ జోన్స్, ఎక్లోస్టోన్ ప్రమాదకరంగా కనిపిస్తున్నారు.
దేశవాళీలో నాలుగు రోజుల మ్యాచ్‌లు ఎక్కువగా ఆడటం పాటు యాషెస్ కార ణంగా కూడా ఇంగ్లండ్ టీమ్ తరచుగా టెస్టు మ్యాచ్‌ల బరిలోకి దిగుతూ వస్తోంది. బీమాంట్‌తో పాటు రెండో ఓపెనర్‌గా డంక్లీ బరిలోకి దిగవచ్చు. కీపర్ ఎమీ జోన్స్ ధాటిగా ఆడగలదు. స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ ఇంగ్లండ్‌కు బౌలింగ్‌లో ప్రధాన బలం. ఇతర బౌలర్లు క్రాస్, బెల్, డీన్ భారత పిచ్‌పై ఏమాత్రం ప్రభావం చూపించగలరో చూడాలి. ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై 2005 తర్వాత టెస్టు మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి.
భారత జట్టులో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు 3 టెస్టులు, స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు 4 టెస్టుల అనుభవం మాత్రమే ఉంది. మిగతా జట్టు సభ్యులకు ఆమాత్రం అనుభవం కూడా లేదు. వన్డేలు, టీ20లతో పోలిస్తే క్రీజ్‌లో నిలవడంలో వీరు ఏమాత్రం పట్టుదల కనబరుస్తారనేది చూడాలి. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూకుడుకు మారుపేరైన షఫాలీ ఇక్కడ కాస్త ఓపికను చూపించి ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రోడ్రిగ్స్ కూడా టెస్టుకు తగినట్లుగా తన ఆటతీరును మార్చుకోగలదని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా, షెఫాలి వర్మ, దీప్తి శర్మ, యాస్తిక, రిచా ఘోష్, స్నేహ్ రాణా, శుభ సతీష్, హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, రేణుక సింగ్, తితాస్ సాధు, మేఘన సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రాకర్.
ఇంగ్లాండ్ జట్టు: టామీ బ్యూమాంట్, డాని వ్యాట్, హీథర్ నైట్ (కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమీ జోన్స్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, లారెన్ బెల్, కేట్ క్రాస్, సోఫీ ఎక్లెస్టోన్