Team India Women's Cricket Recent News: భారత మహిళలు అద్భుతం చేశారు. వన్డే క్రికెట్లో అత్యధిక స్కోరు నమోదు చేశారు. పురుషుల జట్టు కంటే కూడా మహిళలదే ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోరు కావడం విశేషం. బుధవారం రాజకోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 435 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో రెండోవన్డేలో నమోదైన 370 పరుగుల హైయెస్ట్ రికార్డు తెరమరుగైంది. మహిళా  క్రికెట్లో ఇది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. న్యూజిలాండ్ 491 పరుగులతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక, ఓపెనర్ కమ్ కెప్టెన్ స్మృతి మంధాన వేగవంతమైన సెంచరీ (80 బంతుల్లోనే 135, 12 ఫోర్టు, 7 సిక్సర్లు)తో చెలరేగగా, మరో ఓపెనర్ ప్రతీకా రావల్ భారీ సెంచరీ (129 బంతుల్లో 154, 20 ఫోర్లు, 1 సిక్సర్) సత్తా చాటారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. దీంతో 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా భారత జట్టుకిదే అత్యంత భారీ విజయం కావడం విశేషం. ప్రతికా రావాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 

రికార్డు సెంచరీ..

ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచే స్మృతి దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేయడంతో కేవలం 39 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించింది. ఆ తర్వాత మరో 31 బంతుల్లోనే సెంచరీ మార్కును దాటింది. దీంతో 70 బంతుల్లో సెంచరీ చేసి, అత్యంత వేగవంతగా సెంచరీ చేసిన భారత మహిళా బ్యాటర్ గా రికార్డులకెక్కింది. గతంలో ఈ రికార్డు హర్మన్ ప్రీత్ సింగ్ (87 బంతులు) పేరిట ఉండేది. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి ఓపెనర్లు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. తొలి వికెట్ కు 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీ పూర్తయ్యాక స్మృతి వెనుదిరిగినా, ప్రతీకా ఏమాత్రం జోరు తగ్గలేదు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి 52 బంతుల్లో ఫఫ్టీ చేసిన ప్రతీకా.. సెంచరీని వంద బంతుల్లో పూర్తి చేసుకుంది. ఆ తర్వాత జోరు పెంచిన ప్రతీకా.. 27 బంతుల్లోనే 150 పరుగుల మార్కును చేరుకుని ఔటయ్యింది. చివర్లో రిచా ఘోష్ (59) వేగంగా ఆడి ఫిఫ్టీ చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. బౌలర్లలో ప్రెండెర్ గాస్ట్ రెండు వికెట్లతో రాణించింది. 

తిప్పేసిన దీప్తి శర్మ..భారీ ఛేదనలో ఐర్లాండ్ ను భారత స్పిన్నర్ దీప్తి శర్మ ముప్పు తిప్పలు పెట్టింది. గింగరాలు తిరిగే బంతులు విసురుతూ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి పని పట్టింది. ఆమెతోపాటు తనూజ కన్వర్ కూడా రెండు వికెట్లతో సత్తా చాటింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ సారా ఫోర్బ్స (41), ప్రెండెర్ గాస్ట్(36) మాత్రమే కాస్త పోరాట పటిమ కనబర్చారు. మిగతా వారు ఇలా వచ్చి, అలా వెళ్లడంతో 32వ ఓవర్లోనే ఐర్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరపున మహిళలు అత్యధిక వన్డే స్కోరు నమోదు చేశారు. పురుషుల జట్టు అత్యధిక స్కోరు 418 మాత్రమే కావడం విశేషం. 2011లో వెస్టిండీస్ పై ఈ స్కోరు నమోదు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో 304 పరుగుల భారీ విజయాన్ని దక్కించుకున్న భారత మహిళలు.. గతంలో ఐర్లాండ్ పైనే సాధించిన 249 పరుగుల అత్యధిక పరుగుల భారీ విజయాన్ని సరి చేశారు.

Also Read: Rohit Vs BCCI: రోహిత్ సంచలన నిర్ణయం! - పాక్‌‌లో టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరయ్యే ఛాన్స్?, డైలమాలో బీసీసీఐ