Ind Playing XI Vs Uae Latest News:  ఆసియా క‌ప్ 2025లో భార‌త్ బుధ‌వారం నుంచి త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగించ‌నుంది. ఆతిథ్య యూఏఈతో దుబాయ్ లోని International స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనుంది. దాదాపు ఏడునెల‌ల తర్వాత టీమిండియా ఆడ‌బోతున్న తొలి టీ20మ్యాచ్ ఇదే కావ‌డం విశేషం. ఇంగ్లాండ్ తో జ‌రిగిన టీ20 సిరీసే భార‌త్ ఆడిన ఆఖ‌రు టీ20 సిరీస్ కావడం విశేషం. ఆసియాక‌ప్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగుతోంది. శుభ‌మాన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఆడుతున్న ఈ టోర్నీలో, అత‌ని రాక కార‌ణంగా టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్ లో మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఓపెన‌ర్ గా త‌ను ఆడ‌టం క‌న్ఫాం కావ‌డంతో సంజూ శాంస‌న్ పెవిలియన్ కు ప‌రిమితం అవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రో ఓపెన‌ర్ గా యంగ్ అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగుతాడు. లెఫ్ట్ ,రైంట్ కాంబినేష‌న్ కావ‌డంతో ఈ జంట‌కే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపించే అవ‌కాశ‌ముంది.

ప‌టిష్ట‌మైన మిడిలార్డ‌ర్..మిగ‌తా బ్యాట‌ర్ల విష‌యానికొస్తే కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ వ‌న్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగుతుండ‌గా, అతని త‌ర్వాత వ‌రుస‌గా తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌, ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ బ‌రిలోకి దిగుతారు. రింకూ సింగ్ ఫినిష‌ర్ గా ఆడుతాడు. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ గా జితేశ్ శర్మ ఆడుతాడు. ఇక బౌలింగ్ విష‌యానికొస్తే స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా, మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంటారు. ఇక మిగిలిన ఏకైక ప్లేస్ కోసం అర్ష‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ మ‌ధ్య పోటీ నెల‌కొంది. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండ‌టంతో కుల్దీప్ కు తుదిజ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. 

ఫేవ‌రెట్ గా బ‌రిలోకి..ఈ టోర్నీలో ఫేవ‌రెట్ గా భార‌త్ బ‌రిలోకి దిగుతోంది. 1986లో టోర్నీ ప్రారంభ‌మ‌య్యాక అత్య‌ధిక సార్లు టోర్నీని నెగ్గిన టీమ్ గా ఇండియా రికార్డుల‌కెక్కింది. ఓవ‌రాల్ గా ఎనిమిదిసార్లు ఈ ట్రోఫీని ఇండియా కైవ‌సం చేసుకుంది. మ‌రోసారి ఆ ఘ‌న‌త సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక తొలి మ్యాచ్ ఆతిథ్య యూఏఈతో జ‌రుగుతుండ‌గా, దీనినొక వార్మ‌ప్ మ్యాచ్ లాగా ఇండియా భావిస్తోంది. ఈనెల 14న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లాగా దీన్ని వాడుకోనుంది. ఏదేమైనా టీ20 ఫార్మాట్ లో జ‌రుగుతున్న ఈ ట్రోఫీని మ‌రోసారి త‌న ఖాతాలో వేసుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. ఈ ట్రోఫీ సోనీ నెట్ వ‌ర్క్ తోపాటు సోనీ లివ్ యాప్ , వెబ్ సైట్ లో ప్ర‌సారం అవుతుంది. 

ఆసియా కప్ 2025 గ్రూపులు: గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓమాన్. గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు సాంసన్, హర్షిత్ రానా, రింకూ సింగ్.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు: ముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలిషాన్ శరాఫు, ఆర్యాన్ష్ శర్మ, ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాషర్, ఈథన్ డిసోుజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిఖ్, మతియుల్లా ఖాన్, ముహమ్మద్ ఫరూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా, రోహిద్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్, సగీర్ ఖాన్.