Rohit on Jaiswal: నెల రోజుల విరామం తర్వాత మళ్లీ ఫ్రొఫెషనల్ క్రికెట్ బాట పట్టిన టీమిండియా.. నేటి నుంచి వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా జరుగబోయే తొలి టెస్టులో ఆడబోతోంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 7.30 గంటల నుంచి మొదలుకాబోయే ఈ మ్యాచ్‌లో భారత జట్టు కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగబోతుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ముంబై కుర్రాడు, ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రోహితే వెల్లడించాడు.
డొమినికా టెస్టు నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ... ‘బ్యాటింగ్ స్థానాల గురించి చెప్పాల్సి వస్తే శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో వస్తాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో మాట్లాడిన తర్వాత అతడు ఈ స్థానంలో రావడానికి ఆసక్తి చూపాడు. టీమిండియాలో గత ఏడాదికాలంగా ఓపెనర్‌గా రాణిస్తున్న గిల్ గతంలో 3, 4 స్థానాల్లోనే బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఓపెనర్లుగా మాకు లెఫ్ట్ - రైట్ కాంబినేషన్ కావాలి. ఇది మేం చాలాకాలంగా అనుకుంటున్నదే. కానీ మాకు టెస్టులలో సరైన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ దొరకలేదు. ఇప్పుడు యశస్వి రూపంలో ఆ స్థానం భర్తీ కాబోతుంది. అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సుదీర్ఘ కాలం పాటు జట్టులో కొనసాగుతాడని ఆశిస్తున్నాం..’ అని తెలిపాడు.
కాగా, ప్రస్తుతం టీమ్‌లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నా వాళ్లు లోయరార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తారు. ఇషాన్ కిషన్ ఉన్నా అతడిని ఆడిస్తారా..? లేదా..? అన్నది అనుమానమే. ఒకవేళ ఆడినా రిషభ్ పంత్‌ను ఆడించిన మాదిరిగానే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపే అవకాశాలే ఎక్కువ. ఇక పుజారాకు చోటు దక్కకపోవడంతో ఆ స్థానాన్ని గిల్ భర్తీ చేయనుండగా ఆ తర్వాత కోహ్లీ, రహానే తో భారత టాపార్డర్, మిడిలార్డర్ బలంగా కనిపిస్తోంది.
జైస్వాల్‌తో పాటు మరో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌పై కూడా రోహిత్ ప్రశంసలు కురిపించాడు. ‘రెడ్ బాల్ క్రికెట్‌లో సక్సెస్ అవడానికి అన్ని లక్షణాలు రుతురాజ్‌లో ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో తాను ఏం చేయగలననేది అతడు ఐపీఎల్ లో చూపించాడు. ఇండియా తరఫున కూడా అతడు అదే విధంగా రాణిస్తాడని నేను ఆశిస్తున్నా. ఇటువంటి కొత్త, టాలెంటెడ్ కుర్రాళ్లు టీమ్‌లోకి వచ్చినప్పుడు వారితో కలిసి ఆడుతుండటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది..’అని చెప్పాడు.
డొమినికా పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో తాము ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని రోహిత్ అన్నాడు. దీని ప్రకారం.. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ప్లేస్ కోల్పోయిన అశ్విన్.. తిరిగి జట్టులో ప్లేస్ సంపాదించుకోవచ్చు. ‘వికెట్‌ను చూస్తుంటే స్పిన్నర్లకు అనుకూలించే విధంగా ఉంది. మేం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్ల ఫార్ములాతో ఆడతాం. 2017లో ఇక్కడ మేం చివరిసారి టెస్టు ఆడినప్పుడు స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీసుకున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల సమయంలో కూడా మాకు ఇక్కడ స్పిన్‌తో పాటు వికెట్ మీద బౌన్స్ కూడా కనిపించింది. అందుకే మేం 3-2 ఫార్ములాతో వెళ్తున్నాం..’ అని వివరించాడు.