IND vs WI Test Series: భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ ఒక ప్రత్యేకమైన ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో రాహుల్ ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను అధిగమించాడు.
కెఎల్ రాహుల్ ప్రత్యేక రికార్డు
ఈ సంవత్సరం కేఎల్ రాహుల్ 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 13 ఇన్నింగ్స్‌లలో మొత్తం 612 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 50.91 కాగా, ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో రాహుల్ ఈ సీజన్‌లో టాప్ ఓపెనర్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ 6 మ్యాచ్‌లలో 602 పరుగులు చేశాడు. డకెట్ బ్యాటింగ్ సగటు 60.20, కానీ రాహుల్ ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో పాటు బెన్ఈ డకెట్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
వెస్టిండీస్‌పై కీలక ఇన్నింగ్స్
అహ్మదాబాద్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ ఇండియాకు కీలకంగా మారింది. రాహుల్ వ్యక్తిగత ఘనతను సాధించడమే కాకుండా, జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో రాహుల్ ఇండియాకు చాలా కాలం పాటు కీలక ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అని నిరూపించాడు.
యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శన
ఈ జాబితాలో మూడవ స్థానంలో ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. ఈ ఏడాది అతను 7 మ్యాచ్‌లలో 13 ఇన్నింగ్స్‌లలో 479 పరుగులు చేశాడు, ఇందులో 2 సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. జైస్వాల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. భవిష్యత్తులో ఇండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారే అవకాశం ఉంది.
కెఎల్ రాహుల్ రికార్డ్
కెఎల్ రాహుల్ 2025లో కేవలం ఈ రికార్డును సాధించడమే కాకుండా, గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. 2017లో రాహుల్ 14 ఇన్నింగ్స్‌లలో 633 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో 197 బంతుల్లో సరిగ్గా 100 పరుగులకు రాహుల్ ఔటయ్యాడు. వెస్టిండీస్ బౌలర్ వారికన్ బౌలింగ్ లో రాహుల్ ఆడిన బంతిని జస్టిన్ గ్రీవ్స్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. రాహుల్ ఔటయ్యే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.