Sri Lanka beats India by 110 runs to win series 2-0: భారత్(India)తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక(Srilanka) కైవసం చేసుకుంది. కీలకమైన మూడో వన్డేలో ఘన విజయం సాధించిన లంక... సిరీస్‌ను కైవసం చేసుకుంది. . 1997 తర్వాత తొలిసారిగా భారత జట్టు...శ్రీలంకకు వన్డే సిరీస్‌ను సమర్పించింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ టైగా ముగియగా... రెండు, ముడు వన్డేలో లంక ఘన విజయాలు నమోదు చేసింది. శ్రీలంక స్పిన్ మంత్రం ముందు... భారత స్టార్ ఆటగాళ్లు తేలిపోయారు. కీలకమైన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు... ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు కేవలం 138 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను లంక 2-0తో కైవసం చేసుకుంది.
లంక బ్యాటర్ల పోరాటం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంకకు మరోసారి ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆవిష్క ఫెర్నాండో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. శతకానికి కేవలం నాలుగు పరుగుల ముందు ఆవిష్క అవుటయ్యాడు. 102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆవిష్క 96 పరుగులు చేసి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో అవుటయ్యాడు. మరో ఓపెనర్ పాతుమ్ నిసంక 45 పరుగులు చేసి అవుటయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండీస్ కూడా అర్ధ శతకంతో రాణించాడు. టాపార్డర్ రాణించడంతో లంక భారీ స్కోరు దిశగా పయనించింది. అయితే పుంజుకున్న భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు. అసలంక 10, సమరవిక్రమ 0, లియాంగే 8 పరుగులే చేసి అవుటయ్యారు. కానీ చివర్లో కమిందు మెండిస్ చెలరేగడంతో లంక నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.
పోరాటమేదీ..?
249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు అసలు పోరాటమే లేకుండా చేతులెత్తేసింది. 37 పరుగుల వద్ద ప్రారంభమైన వికెట్ల పతనం నిర్విరామంగా సాగింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ కాస్త పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా లంక బౌలర్ల ముందు తేలిపోయారు. రోహిత్ శర్మ 35, శుభ్‌మన్ గిల్ 6, విరాట్ కోహ్లీ 20, శ్రేయస్ అయ్యర్ 8, రిషభ్ పంత్ 6, అక్షర్ పటేల్ 2 , రియాన్ పరాగ్ 15 , శివమ్ దూబే 9 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. వాషింగ్టన్ సుందర్ 30 పరుగులతో కాసేపు పోరాడాడు. కానీ లంక బౌలర్ల ధాటికి వీరు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. లంక బౌలర్లలో వెల్లలాగే నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. భారత జట్టు కేవలం 138 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను లంక 2-0తో కైవసం చేసుకుంది.