India vs Sri Lanka 1st ODI Match ends in a historic tie:  శ్రీలంక-టీమిండియా(SL vs IND) మధ్య జరిగిన తొలి వన్డే క్రికెట్‌ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. చాలా రోజుల తర్వాత వన్డేల్లో రసవత్తరమైన, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ జరిగింది. మాములుగా టీ 20ల్లో ఎక్కువగా మ్యాచ్‌ టై అయిందన్న వార్త వింటుంటాం. అయితే భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ కూడా టైగా ముగిసింది. ఓ దశలో భారత్‌ సునాయసంగా గెలుస్తుందని అనిపించినా లంక బౌలర్లు పుంజుకుని మ్యాచ్‌ను టై చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగుల స్వల్ప స్కోరే చేసింది. అనంతరం 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులకే ఆలౌట్‌ అవ్వడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. 
 



పోరాడిన వెల్లంగే, నిసంక

ఈ మ్యాచ్‌ టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత  బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌ పాతుమ్ నిసంక(pathum nissanka 56 పరుగులతో రాణించాడు.  పాతుమ్ నిస్సంక, దునిత్ వెల్లలగేల అర్ధసెంచరీలతో రాణించడంతో లంక పర్వాలేదనిపించే స్కోరు చేసింది. నిస్సంక (56, 75బంతులు, 9x4), వెల్లలాగే (67 నాటౌట్, 65బంతులు, 7x4, 2x6) రాణించారు. మహ్మద్ సిరాజ్ ఆరంభంలోనే ఆవిష్క ఫెర్నాండోను అవుట్ చేయడంతో శ్రీలంకకు షాక్‌ తగిలింది. తర్వాత కుశాల్ మెండిస్ కూడా 14 పరుగులే చేసి అవుటయ్యాడు. లంక బ్యాటర్ల పేలవమైన షాట్‌ సెలక్షన్‌ కూడా ఓటమికి కారణమైంది. ఐదేళ్ల విరామం తర్వాత వన్డే క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన శివమ్ దూబే ... మెండిస్‌ను అవుట్ చేశాడు. లంక రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులతో పర్వాలేదనిపించింది. అయితే 27వ ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి లంక కష్టాల్లో పడింది. వెల్లలాగే చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. ఎనిమిదో వికెట్‌కు అకిల ధనంజయతో కలిసి 46 పరుగులు జోడించాడు. 59 బంతుల్లో వెల్లలాగే తన తొలి వన్డే ఫిఫ్టీని సాధించాడు.

 

భారత్‌ పోరాడినా..

శ్రీలంక తక్కువ స్కోరే చేసినా వారి స్పిన్‌కు భారత బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 231 పరుగుల ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 58 పరుగులు చేశాడు. హిట్‌ మ్యాన్‌ 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు. రోహిత్ బాదుడుతో టీమిండియా  10 ఓవర్లలో 71 పరుగులు చేసి సునాయసంగా గెలిచేలా కనిపించింది. అయితే కెప్టెన్ చరిత్ అసలంక స్పిన్నర్లను బరిలోకి దిగడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. శివమ్ దూబే (25) పరుగులు చేశాడు. భారత మిడిల్ ఆర్డర్ దారుణంగా తడబడింది. వనిందు హసరంగ (10 ఓవర్లలో 3/58), అకిల దనంజయ (10 ఓవర్లలో1/40), దునిత్ వెల్లలాగే (8 ఓవర్లలో 2/39), చరిత్ అసలంక (8.5 ఓవర్లలో 3/30) భారత బ్యాటర్లను తిప్పలు పెట్టారు. KL రాహుల్ (43 బంతుల్లో 31) మరోసారి రాణించాడు. విరాట్ కోహ్లి (23), శ్రేయస్ అయ్యర్ (24), అక్షర్ పటేల్ (33)లు శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. లంక స్పిన్నర్ల మ్యాజిక్‌తో వన్డే క్రికెట్ చరిత్రలో 44వ టై మ్యాచ్‌ నమోదైంది.