India vs Pakistan Champions Trophy 2025: క్రికెట్ ప్రపంచం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ రైవల్రీకి రంగం సిద్ధం అయ్యిది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈమ్యాచ్ జరుగుతుంది. నిజానికి ఈ టోర్నీని పాక్ హోస్ట్ చేస్తోంది. చరిత్రలో తొలిసారిగా ఆతిథ్య జట్టు.. వేరే దేశానికి వెళ్లి మ్యాచ్ ఆడుతోందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య పొలిటికల్ టెన్షన్ల వల్ల ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. అలాగే పాక్ లో భారత్ పర్యటించలేదు. భద్రత కారణాలతో దుబాయ్ లోనే తమ మ్యాచ్ లను ఆడుతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడిన ఇండియా.. ఆరు వికెట్లతో శుభారంభం చేసింది.
ఆదివారం రెండో లీగ్ మ్యాచ్ లో విజయం సాధించి, సెమీస్ బెర్త్ ను దాదాపుగా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు పాక్ మాత్రం చాలా ఒత్తిడిలో ఉంది. 2017 టైటిల్ నెగ్గి డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన పాక్.. తొలి మ్యాచ్ లో కివీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో భారత్ పై గెలిస్తేనే టోర్నీలో నిలుస్తారు. లేకపోతే టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంటుంది.
గణాంకాలు మనవైపే..వన్డే క్రికెట్ ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే భారత్ పై పాక్ తేలిపోతుందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు కాదు కదా, కొన్ని సార్లు కనీస స్థాయి పోటీ కూడా లేకుండా పోతోంది. 2010 నుంచి చూసుకుంటే ఇరుజట్ల మధ్య 17 వన్డేలు జరిగితే 12 మ్యాచ్ ల్లో భారతే విజయం సాధించింది. కేవలం నాలిగింటిలో ఓడిపోగా, ఒక మ్యాచ్ రద్దయ్యింది. అయితే ఓవరాల్ వన్డే రికార్డును చూసుకుంటే పాక్ కాస్త పైచేయిగా కనిపిస్తోంది. ఇరుజట్ల మధ్య ఓవరాల్ గా 135 వన్డేలు జరుగగా, 73 వన్డేల్లో పాక్ గెలవగా, 57 మ్యాచ్ ల్లో భారత్ గెలిచింది. అయితే అదంతా గతకాలపు ఘనతలే. ప్రస్తుతం పాక్ పరిస్తితి నానాటికీ తీసికట్టుగా ఉంటోంది. చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ లో భారత్.. పాక్ ను చిత్తుగా ఓడించింది. అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ కేవలం 191 పరగులకు ఆలౌట్ అవగా, ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ ను భారత్ సొంతం చేసుకుంది.
ఐసీసీ టోర్నీలో రికార్డు మెరుగు..ఇక కేవలం ఐసీసీ టోర్నీల విషయానికొస్తే మాత్రం పాక్ కాస్త పైచేయిగా నిలిచింది. ముఖాముఖిపోరులో 3-2తో ముందంజలో నిలిచింది. చివరిసారిగా 2017 మెగాటోర్నీ ఫైనల్లో 180 పరుగుల భారీ తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. అయితే ఆదివారం మ్యాచ్ లో గెలిచి, లెక్క సరి చేయడంతోపాటు ఏకంగా టోర్నీ నుంచే పాక్ ను బయటకు గెంటేయాలని భారత్ పట్టుదలగా ఉంది. అన్ని రంగాల్లోనూ అనుభవం, ఫామ్ రిత్యా భారత్ పటిష్టంగా ఉంది. 25వేల మందికిపైగా హాజరయ్యే దుబాయ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వివిధ రకాల ఉపకరణాలలో మ్యాచ్ ను వీక్షిస్తారు. అధికారికంగా ఇండియాలో జియో హాట్ స్టార్, స్పోర్ట్స్ 18 2లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Read Also: Shikhar Dhawan Girl Friend: మిస్టరీ విమెన్ తో ధావన్ చెట్టా పట్టాల్.. ఇప్పటికే పలుమార్లు పబ్లిక్ గా కనిపించిన ఈ జంట.. సోషల్ మీడియాలో పుకార్లు