IND vs NZ, 3rd T20:  డిసైడర్ మ్యాచ్ లంటే భారత ఆటగాళ్లు రెచ్చిపోతారేమో. అలాగే అనిపిస్తోంది ఈ మధ్య టీమిండియా ఆట చూస్తే. న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో ఆఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన హార్దిక్ సేన కివీస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ తో పాటు సిరీస్ ను చేజిక్కించుకుంది. 


మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ (126), రాహుల్ త్రిపాఠి (44), హార్దిక్ పాండ్య (30) రాణించటంతో భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి  కుప్పకూలింది. 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 168 పరుగుల తేడాతో గెలుపొందింది. 


మొదట త్రిపాఠి- తర్వాత గిల్


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్య నమ్మకాన్ని నిలబెడుతూ భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) త్వరగానే ఔటైనా.. రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44), శుభ్ మన్ గిల్ (63 బంతుల్లో 126) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొదట త్రిపాఠి రెచ్చిపోతే.. అనంతరం గిల్ చెలరేగిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24), హార్దిక్ పాండ్య (17  బంతుల్లో 30) కూడా రాణించారు. 


గిల్ విధ్వంసం


వన్డేల్లో డబుల్ సెంచరీతో అదరగొట్టినా.. తొలి 2 టీ20ల్లో ఆకట్టుకోలేకపోయిన ఈ ఓపెనర్ అసలైన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. కళాత్మక షాట్లతో ఆకట్టుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 52 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన భారత ఐదో బ్యాటర్ గా నిలిచాడు. గిల్ కు తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్య (30) కూడా భారీ షాట్లు కొట్టటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రాస్ వెల్, టిక్నర్, సోధి, మిచెల్ తలా వికెట్ దక్కించుకున్నారు. 


భారత బౌలర్ల విజృంభణ


టీమిండియా భారీ స్కోరు సాధించిన పిచ్ పై కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడిన న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే హార్దిక్ పాండ్య కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ (1) ను వెనక్కి పంపాడు. స్లిప్ లో అలెన్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ ను సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా అందుకున్నాడు. ఆ తర్వాత అర్హదీప్ సింగ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి న్యూజిలాండ్ ను దెబ్బతీశాడు. డెవాన్ కాన్వే (1), మార్క్ చాప్ మన్ (0) అర్హదీప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ప్రమాదకర బ్రాస్ వెల్ (8) ను ఉమ్రాన్ బౌల్డ్ చేశాడు. డారిల్ మిచెల్, శాంట్నర్ లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా..  భారత బౌలర్ల ధాటికి కివీస్ 66 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 168 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.