India vs England Second Test : విశాఖ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీ నుంచి భారత్‌– ఇంగ్లాండ్‌ మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్ల వివరాలను ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌ రెడ్డి మీడియాకు బుధవారం వెల్లడించారు. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరో తేదీ వరకు రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్టులో భారత జట్టు ఓటమిపాలు కావడంతో రెండో టెస్ట్ భారత జట్టుకు కీలకంగా మారింది. దీంతో ఈ టెస్టు చూసేందుకు వస్తున్న అభిమానుల సంఖ్య పెరుగుతుందని బిసిసిఐ అంచనా వేస్తోంది. అభిమానుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 15 వేలు, ఆఫ్‌లైన్‌లో 5 వేల వరకు టికెట్లు విక్రయించినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌ రెడ్డి వెల్లడించారు.


విద్యార్థులు, క్లబ్‌ క్రీడాకారులకు ఉచితం 
రెండో టెస్టు మ్యాచ్ ను వీక్షించాలి అనుకునే విద్యార్థులు, క్లబ్ క్రీడాకారులకు  ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. రోజుకు రెండు వేల మంది చొప్పున 5 రోజులకు 10,000 మంది విద్యార్థులు మ్యాచ్‌ చూసేలా ఏర్పాట్లు చేశారు. ఉచిత పాస్ కావాలి అనుకునే విద్యార్థులు యానిఫాం,  ఐడీ కార్డులు తప్పనిసరిగా చూపించాల్సి వుంటుంది. విద్యార్థులను గేట్‌ నంబర్‌ 14 నుంచి ‘కె’ స్టాండ్‌లోకి అనుమతిస్తారు. విద్యార్థులతోపాటు టీచర్లు, ఇన్‌చార్జిలు వస్తే వారు తమ ఐడీ కార్డులను చూపిస్తే స్టేడియంలోకి అనుమతిస్తారు. అలాగే, రోజుకు 2,850 మంది చొప్పు క్రికెట్‌ క్లబ్‌ క్రీడాకారులకు 5 రోజులకు కలిపి 14,250 మందికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.


పార్కింగ్‌ ఇక్కడే చేయాలి.. 
మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు తమ వాహనాలను కల్యాణ్‌ కుమార్‌ పార్కింగ్‌ లే అవుట్, ‘బి’ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో పార్కింగ్‌ చేసుకోవాలి. స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు అవకాశం లేదు. ప్రేక్షకులకు ఉచితంగా తాగునీరు అందించనున్నారు. కొనుగోలు చేసేందుకు  ప్యాకింగ్‌ వాటర్‌ బాటిళ్లు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలో ఏర్పాటు చేసిన రకరకాల ఫుడ్‌స్టాల్స్‌ అందుబాటులో ఉన్న వంటకాలను కొనుగోలు చేసుకోవచ్చు. స్టేడియంలోనికి బయటి నుంచి నీళ్ల బాటిళ్లతో సహా ఎలాంటి తినుబండారాలను ప్రేక్షకులు తమ వెంట తీసుకురావద్దని సూచించారు. వీటితోపాటు కెమెరాలు, బ్యానర్లు, జెండా కర్రలు, స్కూలు బ్యాగులు, లాప్‌టాప్స్, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాటరీలు, సిగరెట్లు, లైటర్లు, హెల్మెట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదు.
ఎనిమిది గంటల నుంచి స్టేడియంలోకి అనుమతి..


మ్యాచ్‌ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది. ప్రేక్షకులను ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. స్టేడియంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే బయటకు వెళ్లి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది.


టికెట్‌ ధరలు రూ. 100 నుంచి అందుబాటులో
జనవరి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్, 26 నుంచి ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టికెట్‌ ధరలు రూ. 100 నుంచి రూ.1,500 వరకు ఉన్నాయి. వీటిలో ఐదు రోజులకు (సీజన్‌) ప్యాకేజీ రూపంలో అందించారు. రోజువారి టికెట్లు రూ.100, రూ.200, రూ.300, రూ.500 కాగా సీజన్‌ మొత్తం( 5 రోజులకు కలిపి) రూ. 400, రూ. 800, 1,000 చొప్పున విలువ చేసే టెకెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్లు ఇన్‌సైడర్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లోనూ, పేటీఎం యాప్‌లో లభిస్తాయి. ఫిబ్రవరి ఆరో తేదీ వరకు పీఎం పాలెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం, ఫిబ్రవరి 1వ తేదీ వరకు స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు.


జోరుగా ఆటగాళ్ళు ప్రాక్టీస్..  
భారతఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు తొలిరోజు జోరుగా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు కీలక ఆటగాళ్లు అంతా చెమటోడ్చారు. మొదటి టెస్టులో ఎదురైన లోపాలపై ప్రత్యేకంగా అదృష్ట సారించి బ్యాటర్లు, బౌలర్లు గంటల తరబడి ప్రాక్టీస్ చేశారు. ఇంగ్లాండ్ అడగాలి కూడా మధ్యాహ్నం నుంచి ప్రాక్టీస్ స్టేషన్లో పాల్గొన్నారు.