Rohit Sharma Ravindra Jadejas incredible partnership in Rajkot: రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో తొలిరోజు 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా(Team India)ను రోహిత్ శర్మ- రవీంద్ర జడేజా(Rohit Sharma- Ravindra Jadeja) ఆదుకున్నారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ-రవీంద్ర జడేజా జోడీ చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇంగ్లండ్‌పై నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా రికార్డు నెలకొల్పింది. 1985లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో నాలుగో వికెట్‌కు మహ్మద్ అజారుద్దీన్-మొహిందర్ అమర్నాథ్ నెలకొల్పిన 190 పరుగుల భాగస్వామ్యం రికార్డును రోహిత్‌ శర్మ-రవీంద్ర జడేజా బద్దలు కొట్టారు. టెస్టుల్లో స్వదేశంలో 1579 రోజుల తర్వాత టీమిండియా ఏ వికెట్‌కైనా 200కుపైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంటే నాలుగేళ్ల తర్వాత భారత జట్టుకు మళ్లీ 200కుపైగా పరుగుల భాగస్వామ్యం లభించింది. ఈ ఘనత సాధించిన జోడిగా రోహిత్-జడేజా నిలిచారు. స్వదేశం, విదేశాల్లో కలిపి ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ తరఫున నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో రోహిత్-జడేజా మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడి(249) పరుగులతో ముందు ఉంది.

 

సహజ శైలికి భిన్నంగా

ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్‌ తన సహజశైలికి విరుద్ధంగా ఆచితూచి ఆడాడు. ఆరంభంలో రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్‌ స్లిప్‌లో రూట్‌ వదిలేశాడు. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న రోహిత్‌ శర్మ అద్భుత శతకంతో భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 157 బంతుల్లో రోహిత్‌ శర్మ శతకాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది పదకొండో సెంచరీ కావడం గమనార్హం. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ శర్మ 131 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రోహిత్‌- జడేజా 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 237 పరుగుల వద్ద రోహిత్ అవుటవ్వడంతో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 

 

జడేజా శతక జోరు

టీమిండియా సారధి రోహిత్‌ శర్మ, లోకల్‌ బాయ్‌ రవీంద్ర జడేజా శతక గర్జన చేయడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును రోహిత్‌, రవీంద్ర జడేజా అద్భుత శతకాలతో ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపారు. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అర్ధశతకంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.  దురదృష్టవశాత్తు సర్ఫరాజ్‌ రనౌట్‌ అయినా... సాధికార బ్యాటింగ్‌తో తన ఎంపిక సరైందేనని నిరూపించుకున్నాడు. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు.