India vs England 4th test: రాంచీ(RAnchi) వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌(England) 145 పరుగులే ఆలౌట్‌ అయింది. టీమిండియా(Team India) స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్‌ వికెట్ల పతనం వేగంగా సాగింది. దీంతో టీమిండియా ముందు 192 పరుగుల లక్ష్యం నిలిచింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ 5 వికెట్లతో బ్యాటర్లను కట్టిపడేశాడు. కుల్‌దీప్ 4, జడేజా ఒక వికెట్‌ తీశారు. అన్ని వికెట్లు స్పిన్నర్లకే పడటం విశేషం. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో క్రాలే 60, బెయిర్‌ స్టో 30, మినహా అందరూ విఫలమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత్‌ విజయానికి 192 పరుగులు చేయాలి.


సెంచరీ కోల్పోయినా..

తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ జురెల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ పోరాటం ఆకట్టుకుంది. జురెల్‌ 90 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ 131 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసి జురెల్‌కు మంచి సహకారం అందించాడు. చాలా ఓపిగ్గా అసలైన టెస్ట్‌ బ్యాటర్‌లా కనిపించిన కుల్‌దీప్‌ను... అండర్సన్‌ అవుట్‌ చేశాడు. 90 పరుగుల వద్ద జురెల్‌ అవుట్‌ కావడంతో టీమిండియా పోరాటం ముగిసింది. జురెల్‌ 90, యశస్వీ జైస్వాల్‌ 73, గిల్‌ 38,  కుల్‌దీప్‌ యాదవ్‌  28 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బషీర్‌ 5, హార్ట్‌లీ 3, అండర్సన్‌ రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌ను ఎంత త్వరగా ఆలౌట్‌ చేస్తారన్న దానిపై టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌

రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓ వైపు రూట్ అడ్డుగోడలా నిల్చినా... అవతలి వైపు వికెట్లన్నీ నేలకూలాయి. ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ... మరో 51 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన రాబిన్సన్ టెస్టుల్లో తొలి అర్ధ శతకం సాధించాడు. మరోవైపు రూట్ బజ్ బాల్ ఆటకు స్వస్తి పలికి ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. రూట్ -రాబిన్సన్ కలిసి ఎనిమిదో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ భాగస్వామ్యాన్ని జడేజా విడదీశాడు. ఒకే ఓవర్లో జడేజా రెండు వికెట్లు తీశాడు. తొలుత రాబిన్సన్ ను అవుట్ చేసిన జడేజా.. అదే ఓవర్ లో బషీర్ ను ఔట్ చేశాడు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్ 3, సిరాజ్ 2 వికెట్లు తీయగా అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది.

 

యశస్వీ మరో రికార్డ్

ఈ టెస్ట్‌ సిరీస్‌లో వరుస డబుల్‌ సెంచరీలతో అదరగొట్టిన యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ మరో అరుదైన రికార్డ్‌ సాధించాడు. ఒకే సిరీస్‌లో 600లకు పైగా పరుగులతో అదరగొట్టి ఈ ఘనతను అందుకున్న ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు.

గతేడాది వెస్టిండీస్‌ పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వి ఈ సిరీస్‌లో రెండు ద్విశతకాలు నమోదు చేశాడు. కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 618 పరుగులు చేశాడు. తొలి టెస్టులో 80, 15; రెండో టెస్టులో 209, 17; మూడో టెస్టులో 10, 214; నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 73 సాధించాడు.