India Set Massive World Record: స్వదేశంలో ఇంగ్లండ్‌(England) జట్టను మరోసారి భారత్‌(Team India) మట్టికరిపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్‌(England)పై ఏకంగా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్‌ ద్వి శతక గర్జనతో బ్రిటీష్‌ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అయిదు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. మూడో రోజు ఆటకు అర్ధాంతరంగా దూరమైన అశ్విన్‌ తిరిగి జట్టులోకి వచ్చి వికెట్‌ సాధించగా... వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకం సాధించి సర్ఫరాజ్‌ ఖాన్‌ సత్తా చాటాడు. ఈ విజయంతో టీమిండియా  92  ఏళ్ల టెస్ట్‌ చరిత్రలో కొత్త చరిత్ర లిఖించింది. 

 

చరిత్ర సృష్టించిన భారత్‌..

ఇంగ్లాండ్‌పై అద్భుతమైన విజయంతో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే 434 పరుగుల తేడాతో గెలవడం పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ విజయం. అంతకుముందు 2021లో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును భారత్‌ బ్రేక్‌ చేసింది.

 

 రెండో స్థానానికి ఎగబాకిన భారత్‌

రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించడంతో భారత్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పట్టికలో తిరిగి రెండో స్థానానికి ఎగబాకింది. గతవారం దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు టెస్టులు నెగ్గిన న్యూజిలాండ్‌ 75 శాతంతో అగ్రస్థానానికి చేరుకోగా, అప్పటిదాకా టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి, రెండులో ఉన్న భారత్‌ మూడో స్థానానికి పడిపోయింది. తాజాగా ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించడంతో రోహిత్‌ సేన రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 59.52 శాతంతో రోహిత్‌ సేన రెండో స్థానంలో ఉండగా.... 55 శాతంతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉండగా.. ఇంగ్లండ్‌ 21.88 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది. 

 

స్టోక్స్‌ ఏమన్నాడంటే

బెన్ డకెట్ సూపర్‌ సెంచరీతో అద్భుతంగా ఆడాడని  తొలి ఇన్నింగ్స్‌ ఆసాంతం ఇదే దూకుడుగా ఆడాలని భావించామని స్టోక్స్‌ అన్నాడు. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకు దగ్గరగా వెళ్లేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా తాము ఆ అవకాశాలను చేతులారా వృథా చేసుకున్నామని తెలిపాడు. బౌలింగ్‌ చేద్దామని ముందే అనుకున్నామని... కానీ, అనుకున్నదానికంటే చాలా ముందుగానే బౌలింగ్‌ వేయాల్సి వచ్చిందన్నాడు. తాము ఇప్పుడు 1-2తో వెనుకబడి ఉన్నామని... కానీ తప్పకుండా పుంజుకుని సిరీస్‌లో ముందడుగు వేస్తామన్నారు. వచ్చే రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే సిరీస్‌ను నెగ్గేందుకు ఆస్కారముందని బెన్ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు.