India vs England 3rd Test Day 3 India lead by 322 runs vs England: రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌(Bharat) పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ (England)ఆధిపత్యం ప్రదర్శించగా... మూడోరోజు టీమిండియా(Team India) సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో బ్రిటీష్‌ జట్టును త్వరగానే అవుట్‌ చేసిన భారత జట్టు... అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్‌ చేసి టెస్ట్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ప్రస్తుతం 322 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌ చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్‌ మరోసారి శతక గర్జన చేశాడు.  ఇంకో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న వేళ... భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

 

ఇంగ్లాండ్‌ ఆలౌట్‌ అయిందిలా..

మూడో టెస్టు మూడో రోజు ఆట ప్రారంబించిన ఇంగ్లండ్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. కానీ వారిని భారత్ బౌలర్లు విజయవంతంగా నిలువరించారు. తొలి ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా రెండు పరుగులు ఇచ్చాడు. ఐదో ఓవర్‌లో టీమిండియాకు బ్రేక్‌ త్రూ వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో... యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్‌తో రూట్‌ను పెవెలియన్‌ చేరాడు. రూట్ 31 బంతుల్లో 18 పరుగులు చేశాడు. రూట్‌ తర్వాత వచ్చిన జానీ బెయిర్ స్టో ఖాతా తెరవకుండానే కుల్దీప్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు డకెట్‌. ఈ క్రమంలోనే బెన్ డకెట్ కేవలం 135 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్లో డకెట్ ఈ ఘనత సాధించడం ఇది రెండోసారి. 153 పరుగులు చేసిన తర్వాత డకెట్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు. ఐదో వికెట్‌ రూపంలో డకెట్‌ వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ క్రీజ్‌లో నిలదొక్కునే ప్రయత్నం చేశారు. ఇలా తొలి సెషన్‌ ముగిసే సరికి టీమ్ఇండియా 83 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్ ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. రెండో సెషన్‌ ప్రారంభమైన తర్వాత టీమిండియా వేగం పెంచింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో బెన్ స్టోక్స్ బౌండరీలో చిక్కాడు. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే సిరాజ్... బెన్ ఫోక్స్‌ను ఔట్ చేశాడు. స్టోక్స్ 41, ఫోక్స్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. రెహాన్ అహ్మద్‌ను మహ్మద్ సిరాజ్ యార్కర్‌తో బోల్తా కొట్టించాడు. టామ్ హార్ట్లీ రవీంద్ర జడేజాకు చిక్కాడు. ఆఖరి వికెట్‌ ఆడ్రంసన్‌ను సిరాజ్‌ 319 పరుగుల వద్ద తీశాడు. దీంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 

 

యశస్వి ధనాధన్‌

126 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. బ్రిటీష్‌ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా పయనిస్తున్నారు. తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించిన అనంతరం సారధి రోహిత్‌ శర్మ అవుటయ్యాడు. 19 పరుగులు చేసిన రోహిత్‌ శర్మను రూట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ యశస్వి జైస్వాల్ వన్డే తరహా బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్...  133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 104 పరుగులు చేసి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం వెన్ను నొప్పితో బాధపడుతూ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 191 పరుగుల వ‌ద్ద జైస్వాల్‌ రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రజత్‌ పాటిదార్‌.. డకౌట్‌గా వెనుదిరిగాడు. హార్ట్‌లి వేసిన బంతికి రహన్‌కు సులభమైన క్యాచ్‌ ఇచ్చి పాటిదార్‌ అవుటయ్యాడు.  రెండో టెస్ట్‌లో శతకంతో మెరిసిన శుబ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. ఇప్పటికే ఆర్ధ శతకం పూర్తి చేసుకున్న గిల్‌... శతకం దిశగా పయనిస్తున్నాడు. నైట్‌ వాచ్‌మన్‌గా బరిలోకి దిగిన కుల్‌దీప్‌ యాదవ్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా టీమిండియా మూడో రోజు ఆట ముగించింది.  మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ప్రస్తుతం 322 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌ చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి.