IND vs AUS, WC Final 2023:   ఈ ప్రపంచకప్‌లో టీమిండియా(Team India) విజయ ప్రస్థానం అంతా ఓ పద్ధతి ప్రకారం సాగింది. ఆరంభంలో ఆస్ట్రేలియా(Austrelia) తో మ్యాచ్‌లో తప్ప ప్రతీ మ్యాచ్‌లోనూ టీమిండియాకు రోహిత్‌-గిల్‌(Rohit-Gill)  శుభారంభాలు అందించారు. ముఖ్యంగా రోహిత్‌ శర్మ... ఆరంభంలోనే దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీస్తున్నాడు.  ఆ తర్వాత వచ్చే కోహ్లీ(Virat Kohli) బౌలర్లపై ఆదిపత్యం చెలాయిస్తున్నాడు. బౌలింగ్‌లోనూ ఇదే ప్రణాళికతో టీమిండియా ముందుకు సాగింది. బుమ్రా(Bumrah) పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం ఆ తర్వాత సిరాజ్‌(Siraj), షమీ(Shami) వికెట్లను తీయడం జరుగుతుంది. కానీ ఫైనల్లో ఈ వ్యూహానికి భిన్నంగా టీమిండియా ప్రయత్నించే అవకాశం ఉందని మాజీలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆస్ట్రేలియా... టీమిండియా అనుసరిస్తున్న వ్యూహాలపై పక్కా ప్రణాళిక రచించి ఉంటుంది. కాబట్టి రోహిత్‌ సేన భిన్నమైన వ్యూహాలతో సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంగారుల అంచనాకు అందని విధంగా భారత్‌ భిన్నంగా ఏమైనా చేస్తుందేమో చూడాలి. ఆరంభ ఓవర్లలో రోహిత్‌ మీదే గురిపెడతారు కాబట్టి.. ఈసారి అతను తగ్గి శుభ్‌మన్‌ షాట్లకు దిగడం లాంటిది జరిగచ్చు. రోహిత్‌ నిదానంగా ఆడితే శుభ్‌మన్‌ గిల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేసి కంగారుల ఎత్తులను చిత్తు చేసే అవకాశం కూడా ఉంది. 

 

టాస్‌ గెలిస్తే

ఈ ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో టాస్‌ కీలక పాత్ర పోషించింది. అయితే ఫైనల్‌ జరిగే అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగు లీగ్‌ మ్యాచ్‌ల్లో మూడుసార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. పాకిస్థాన్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లోనూ భారత్‌ టార్గెట్‌ను సునాయసంగా ఛేదించి విజయం సాధించింది. ఈసారి కూడా టాస్‌ గెలిస్తే రోహిత్‌ బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే టోర్నీలో మెజారిటీ మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు చేసి కూడా టీమిండియా గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు సాధింటి కంగారులపై ఒత్తిడి పెంచాలని వ్యూహాన్ని కూడా రచించి ఉండవచ్చు. 

 

మరోవైపు స్టేడియంలో  పోరును వీక్షించేందుకు  దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు అహ్మదాబాద్‌కు  చేరుకుంటున్నారు. ముంబై, ఢిల్లీ నుంచి అభిమానులు  ప్రత్యేక రైళ్లలో తరలివెళ్లారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వాతావరణం సహకరిస్తుందా?లేదా అనే అనుమానం అభిమానుల మనసులను తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ క్లారిటీ ఇచ్చింది. అహ్మదాబాద్‌లో వర్ష సూచన లేదని స్పష్టం చేసింది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని, దాదాపు 32 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. అయితే 19 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వెల్లడించింది. 2003 ప్రపంచకప్‌ తర్వాత భారత్‌-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచుల్లో ఓటముల నుంచి కోలుకుని  వరుస విజయాలతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా తుదిపోరులోనూ అదేజోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.