Narendra Modi Stadium: దేశవ్యాప్తంగా ప్రపంచకప్  ఫైనల్  ఫీవర్ కనిపిస్తోంది. అహ్మదాబాద్‌(Ahamadabad)లో  ఎక్కడ చూసినా  క్రికెట్ అభిమానులు భారత జెర్సీల్లో దర్శనమిస్తున్నారు.  రోడ్లపైకి  భారత జెండాలతో వచ్చి రోహిత్ సేన విజయం సాధించాలని కేరింతలు కొడుతున్నారు. మరోవైపు స్టేడియంలో(Stadium)  పోరును వీక్షించేందుకు  దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు అహ్మదాబాద్‌కు  చేరుకుంటున్నారు. ముంబై, ఢిల్లీ నుంచి అభిమానులు  ప్రత్యేక రైళ్లలో తరలివెళ్లారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వాతావరణం(Weather)  సహకరిస్తుందా?లేదా అనే అనుమానం అభిమానుల మనసులను తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ క్లారిటీ ఇచ్చింది. అహ్మదాబాద్‌లో వర్ష సూచన లేదని స్పష్టం చేసింది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని, దాదాపు 32 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. అయితే 19 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వెల్లడించింది. 2003 ప్రపంచకప్‌ తర్వాత భారత్‌-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో(IND vs AUS World Cup 2023 Final) అమీతుమీ తేల్చుకోనున్నాయి. 



 మరోవైపు క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్దక్రికెట్ మైదానమైన అహ్మదాబాద్‌ మోదీ స్టేడియంలో టైటిల్ కోసం భారత్ -ఆస్ట్రేలియా తలపడనున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు అన్నిమ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న టీమిండియా ఫైనల్‌లోను జైత్రయాత్ర  కొనసాగించాలని కసిగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌లు ఓడి తర్వాత పుంజకున్న కంగారూ జట్టు తుదిపోరులోనూ గెలిచి 2003 ప్రపంచకప్‌ను రిపీట్ చేయాలని  భావిస్తోంది.



 అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో..రెండుసార్లు టోర్నీ విజేత భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.మధ్యాహ్నం  రెండు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ పోరులో..... కచ్చితంగా విజయం  సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 2003 ప్రపంచకప్‌ ఫైనల్ పరాభవానికి  బదులు తీర్చుకోవాలని కసిగా కనిపిస్తోంది. ఈ టోర్నీ మొత్తం ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ ప్రణాళికబద్దంగా ఆడిన భారత్ ఫైనల్‌లోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ఫైనల్  మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్ మరోసారి శుభారంభం ఇవ్వాలని కోహ్లీ అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 



 శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ , కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ మరోసారి రాణిస్తే భారత్‌కు తిరుగుండదని  చెబుతున్నారు. మహమ్మద్ షమీ (Shami), జస్ ప్రీత్ బూమ్రా(Bumrah),మహ్మద్ సిరాజ్(Siraj), కుల్‌దీప్ యాదవ్(Kuladip Yadav), రవీంద్ర జడేజా(Ravindra Jadija)లతో బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది. అశ్విన్‌ను మూడో స్పిన్నర్ గా తీసుకుంటే సిరాజ్ బెంచ్ కు పరిమితమయ్యే అవకాశముంది. అటు..ఈ మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచుల్లో ఓటముల నుంచి కోలుకుని  వరుస విజయాలతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా తుదిపోరులోనూ అదేజోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో వార్నర్‌, హెడ్‌లు అదేదూకుడుతో ఆడి భారత్‌ను ఇబ్బంది పెట్టాలని ఆసీస్ వ్యూహాలను రచిస్తోంది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో చెలరేగి ఆడిన మ్యాక్స్‌వెల్‌తో పాటు మార్ష్ ,స్మిత్‌లతో కూడిన బ్యాటింగ్ దళం పటిష్ఠంగానే ఉంది.