Virat Kohli Single Run Celebration: సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సిడ్నీలో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సింగిల్ రన్ తీసిన వెంటనే స్టేడియం మొత్తం కేరింతలతో మారుమోగింది. అభిమానులు గట్టిగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కింగ్ కోహ్లీ సైతం తొలి పరుగులు పూర్తి చేయకముందే సంబరాలు చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి గిల్ మొదటి వికెట్‌కు 69 పరుగులు జోడించాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి వన్డే పెర్త్‌లో జరిగింది. మరోవైపు రోహిత్ శర్మ, కోహ్లీ 224 రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నారు. అభిమానులు కోహ్లీ, రోహిత్ శర్మలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ తొలి వన్డేలో కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలోనూ కోహ్లీ పరుగుల ఖాతా తెరవలేకపోవడంతో అభిమానుల గుండె బద్దలైంది. చరిత్రలో తొలిసారిగా విరాట్ కోహ్లీ వరుసగా 2 వన్డేల్లో డకౌట్ అయ్యాడు.
రెండు 'డక్'ల తర్వాత ఖాతా తెరిచిన విరాట్ కోహ్లీ
శనివారం నాడు సిడ్నీలో జరుగుతున్న మూడో వన్డేలో తాను ఎదుర్కొన్న తొలి బంతికే విరాట్ కోహ్లీ ఒక రన్ పూర్తి చేశాడు. బంతిని ఆడిన వెంటనే పరుగు పూర్తి చేయకముందే కోహ్లీ సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది ఈ సిరీస్‌లో కోహ్లీ చేసిన మొదటి పరుగు. అందులోనూ కీలకమైన ఆస్ట్రేలియాతో సిరీస్ లో రెండు 'డకౌట్'ల తర్వాత కోహ్లీ మరో డకౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దాంతో కోహ్లీ చేసిన మొదటి రన్ అభిమానులను ఉత్తేజపరిచింది. మరోవైపు కోహ్లీ సైతం ఏదో సాధించిన తరహాలో పడికిలి బిగించి సెలబ్రేట్ చేసుకున్నాడు. సిడ్నీ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులందరూ కోహ్లీ తొలి పరుగు చేయగానే చప్పట్లు కొట్టారు. ఈ సమయంలో కోహ్లీ ముఖంలో చిరునవ్వు కనిపించింది.
డకౌట్ టెన్షన్ నుంచి బయటపడిన కోహ్లీ..
తొలి వన్డేలో డకౌట్ కాగా, రెండో వన్డేలోనూ డకౌట్ కావడంతో గ్లోవ్స్ చూపిస్తూ పెవిలియన్ చేరడంతో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే తాను అభిమానులను మరోసారి నిరాశపరిచాను. సారీ అనేలా గ్లోవ్స్ చూపిస్తూ వెళ్లిపోతున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. మూడో వన్డేలో ఒత్తిడిని జయించిన కోహ్లీ మొదట సింగిల్ తీసి డకౌట్ నుంచి తప్పించుకుని టెన్షన్ ఫ్రీ అయ్యాడు. తరువాత రోహిత్ తో పోటీపడి బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా 4 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.