Yashasvi Jaiswal:


టీమ్‌ఇండియా యువ కెరటం యశస్వీ జైశ్వాల్‌పై (Yashasvi Jaiswal) రవిచంద్రన్ అశ్విన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు భవిష్యత్తులో స్టార్‌ అవుతాడని పేర్కొన్నాడు. అతడిలో చాలా సామర్థ్యం ఉందని వెల్లడించాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడిని సరైన వాతావరణంలో ఉంచాలని సూచించాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు తొలి రోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు.






వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్సులో మొదట బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్‌ జట్టును 64.3 ఓవర్లకు కేవలం 150 పరుగులకే ఆలౌట్‌ చేసింది. తొలిరోజే బంతి అందుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) అద్భుతమే చేశాడు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. 24.3 ఓవర్లు వేసిన అతడు 2.44 రన్‌రేట్‌తో 60 పరుగులే ఇచ్చాడు. ఓపెనర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, టెగె నరైన్‌ చందర్‌పాల్‌, అలిక్‌ అథనేజ్‌, అల్జారీ జోసెఫ్‌, జోమెల్‌ వారికన్‌ను ఔట్‌ చేశాడు. సహచర స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సైతం మెరిశాడు. 14 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.


ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా ఆట ముగిసే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్‌ (40 బ్యాటింగ్‌), రోహిత్‌ శర్మ (30 బ్యాటింగ్‌) అజేయంగా నిలిచారు. హిట్‌మ్యాన్‌ తనదైన పుల్‌షాట్లు, నటరాజ షాట్లతో అలరించాడు. అరంగేట్రం వీరుడు జైశ్వాల్‌ స్వీప్‌ షాట్లతో అత్యంత నిలకడగా ఆడాడు. 'తొలి రోజు ఆఖరి ఓవర్‌ తొలి బంతిని జైశ్వాల్‌ స్వీప్‌ చేశాడు. అతడి నుంచి అంతకన్నా ఏం ఆశిస్తాం చెప్పండి. అతడెంతో తెలివైనవాడు. సుదీర్ఘంగా ఆడాలని కోరుకుంటున్నా. మేం అతడిని మంచి వాతావరణంలో ఉంచాలి' అని యాష్‌ అన్నాడు.






ఈ మ్యాచులో ఐదు వికెట్లు పడగొట్టిన ఇంటర్నేషనల్ క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌ సరసన నిలిచాడు. 'నా ప్రదర్శన బాగుంది. తొఇ సెషన్లో పిచ్‌పై తేమ కనిపించింది. ఆ తర్వాత నెమ్మదించి స్పిన్‌కు అనకూలంగా మారింది. ఆట సాగేకొద్దీ మరింత మందకొడిగా మరింది. రెండో సెషన్‌ నుంచి సులభంగా బౌలింగ్‌ చేసినప్పటికీ నేను మొదటి స్పెల్‌ ఎంజాయ్‌ చేశాను. పరిస్థితులను అలవాటు చేసుకున్నాను. పిచ్‌ మందకొడిగా మారుతుందని తెలుసు. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌ అయినప్పుడు నెమ్మదించడం గత పర్యటనల్లో గమనించాను' అని యాష్ అన్నాడు.


'అంతర్జాతీయ క్రికెట్లో మనం నిరంతరం మెరుగవుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యన చాలా లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్నాం. అక్కడి ప్రదర్శనలు, ఆట తీరు నుంచి త్వరగా బయటపడాలి' అని రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial